Share News

CM Chandrababu On GST Reforms: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:27 PM

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్ లోడ్‌లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించామని.. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని తెలియజేశారు.

CM Chandrababu On GST Reforms: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం
CM Chandrababu On GST Reforms

అమరావతి, సెప్టెంబర్ 30: జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసే సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే... ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుందన్నారు. ప్రజలతో మమేకం కావడమే కాదని... ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నేతలకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులన్నారు. పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహర శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని వెల్లడించారు.


గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్ లోడ్‌లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించామని.. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని తెలియజేశారు. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టామన్నారు. సమర్థ పాలనకు.. అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలని సూచించారు. జనాభాలో 13 శాతం మందికి పెన్షన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం రూ.5500 కోట్లు మాత్రమే ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.


ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోందని సీఎం అన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తున్నామని.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేతలను ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్ దీన్ని ప్రజలకు చెప్పాలని... ఓనర్ షిప్ తీసుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే... ప్రజలు మనవైపే నిలుస్తారన్నారు. ప్రజలు మనవైపు ఉంటే... రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కూటమిగా ఉన్నామని... అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని.. అంతకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి..

కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

విద్యుత్ ఛార్జీలపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2025 | 12:41 PM