Gorttipati Ravi On Power Tariff: విద్యుత్ ఛార్జీలపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:16 AM
విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని మంత్రి తెలిపారు. అనైతిక విధానాలతో వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలపై జగన్ 18వేల కోట్ల భారం మోపారని విమర్శించారు.
అమరావతి, సెప్టెంబర్ 30: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Minister Gottipati Ravikumar) నేతృత్వంలోని అధికారుల బృందం ఈరోజు (మంగళవారం) నుంచి ఫ్రాన్స్‌లో పర్యటించనుంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఈ బృందం ఆహ్వానించనుంది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారి విద్యుత్ చార్జీలు ట్రూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిది అని కొనియాడారు.
విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని తెలిపారు. అనైతిక విధానాలతో వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలపై జగన్ 18వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. జగన్ పాపాలను ఈనాటికీ భరిస్తూనే చార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. జగన్ పీపీఏ రద్దు చేయటం వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాడుకోలేకపోయామని... అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవటంతో రూ.9వేల కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చిందనని వెల్లడించారు. జగన్ దెబ్బకు పారిపోయిన పెట్టుబడిదారుల్లో తిరిగి నమ్మకం పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లతో ప్రజలపై భారం మోపిందని వ్యాఖ్యానించారు. 17 శాతం ఉన్న షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం 6.8 శాతానికి తెచ్చిందన్నారు. స్వాపింగ్ విధానం ద్వారా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో విద్యుత్ ఇచ్చి పుచ్చుకునే దిశగా పని చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఏఐ, ఐటీ పరిజ్ఞానం ద్వారా వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేస్తూ విద్యుత్ డిమాండ్ అంచనా వేయగలుగుతున్నామని మంత్రి తెలిపారు. బ్యాటరీ స్టోరేజీ విధానంతో పాటు, స్వాపింగ్ విధానం, పీఎస్పీ, రెన్యూవల్ ఎనర్జీ, వంటి వినూత్న విధానాలతో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ తక్కువ ఖర్చుకే ఇస్తామన్నారు. విద్యుత్ రంగంపై చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో ప్రజలకు ఆదాయం సమకూరుస్తున్నారని అన్నారు. ప్రతీ ఏటా 5 శాతం మేర పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. భయాందోళనలో గ్రామస్తులు
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Read Latest AP News And Telugu News