APSRTC: కార్తీకం.. శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ఏర్పాట్లు..
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:11 AM
కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
కాకినాడ, అక్టోబర్ 20: పరమ శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ నెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చాలా మంది పంచారామాలతోపాటు శైవ క్షేత్రాలను సందర్శిస్తారు. ఇక అయ్యప్ప మాలధారులు సైతం శబరిమలకు వెళ్తుంటారు. ఆ భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ బస్టాండ్ల నుంచి మొత్తం 157 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది.
శ్రీశైలానికి రోజూ..
కాకినాడ నుంచి శ్రీశైలంకు ప్రతి రోజూ ఉదయం 7.45 గంటలకు బస్సు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. ఈ బస్సులు ఈ మాసం మొత్తం నడుస్తాయని వివరించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అవసరమైతే మరిన్ని పెంచుతామని చెప్పింది.
శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలు..
ఈ మాసం పురస్కరించుకుని ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలను దర్శించేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అక్టోబర్ 25, 26 తేదీలతోపాటు నవంబర్ 2,9, 16 తేదీల్లో జిల్లాలోని వివిధ బస్టాండ్లు నుంచి ఈ బస్సులు బయల్దేరతాయని వివరించింది. తద్వారా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకోవచ్చు. గత ఏడాది ఇదే నెలలో 26 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా.. ఈ సారి వాటి సంఖ్యను 36కి పెంచారు. సూపర్ లగ్జరీ ధర రూ.1,120, అల్ట్రా డీలక్స్ ధర రూ.1,070గా నిర్ణయించారు.
శబరిమల యాత్ర..
జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుంచి శబరిమలకు కొత్త సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను తిప్పనున్నారు. గతేడాది శబరిమలకు 4 ప్రత్యేక బస్సులు నడిపారు. ఈ సారి ఆ సంఖ్యను 8కి పెంచనున్నారు. అలాగే అయ్యప్ప భక్తులు.. వారు కోరుకున్న చోటు నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సు సర్వీసుల్లో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశంతోపాటు ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని సైతం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు
For More AP News And Telugu News