Share News

ACB Court: అధికార విధులు దాటి అక్రమాలు

ABN , Publish Date - May 18 , 2025 | 03:41 AM

సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్‌ వాదించింది. రూ.3500 కోట్ల దుర్వినియోగంపై విచారణ అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి అవసరం లేదని ఏడీ రాజేంద్ర ప్రసాద్‌ స్పష్టం చేశారు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ, జైలులో సౌకర్యాలు కల్పించాలన్న నిందితుల విజ్ఞప్తికి అంగీకరించింది.

 ACB Court: అధికార విధులు దాటి అక్రమాలు

  • ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ విచారణకు కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి అక్కర్లేదు

  • ఇది సాధారణ కేసు కాదు: ప్రాసిక్యూషన్‌

  • 20 వరకు రిమాండ్‌..జైలులో పడక, దిండు, దుప్పటి

  • సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశం

విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి) : సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి , జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి అధికార విధులను దాటి మద్యం పాలసీలో వేలు పెట్టి అక్రమాలు చేశారని ప్రాసిక్యూషన్‌ తరఫు ఏడీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. వైసీపీ హయాంలో మద్యం కంపెనీలనుంచి ముడుపులను భారీగా పొందడానికి ప్రణాళికను రూపొందించడంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ అధికార దుర్వినియోగం చేశారన్నారు. దోచుకున్న రూ.3500 కోట్లు అంతిమంగా ఎక్కడికి ఏ ఏ మార్గాల్లో చేరిందో తేల్చడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు. నిందితుల తరపున మాజీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో దీనికి ప్రత్యేక పోలీసు స్టేషన్‌ కల్పించారన్నారు. దానిప్రకారం సిట్‌ దర్యాప్తు చేసిన కేసు విచారణ ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదన్నారు. సిట్‌, సీఐడీ ఒకటి కావని తెలిపారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని చెబుతున్న సిట్‌ దానికి సంబంధించి ఆధారాలను చూపించడం లేదన్నారు. ధనంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ అధికారులుగా పనిచేశారని, వారిని విచారించడానికి సిట్‌ కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి తీసుకోలేదని వివరించారు. సిట్‌ అధికారులు రిమాండ్‌ రిపోర్టును తప్పుగా రూపొందించారన్నారు. పోలీసుల కస్టడీలో ఉండగానే కస్టడీకి ఇవ్వాలని రాశారన్నారు. దీనిపై ఏడీ రాజేంద్ర ప్రసాద్‌ స్పందిస్తూ.. వారిని విచారించడానికి కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి పి.భాస్కరరావు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు.


ఈ సమయంలో నిందితులు.. తమకు జైలులో సౌకర్యాలు కల్పించాలని కోరా రు. ఈ మేరకు వారికి పడక, దిండు, దుప్పటి, కమోడ్‌ సముదాయాలు ఇవ్వాలని న్యాయాధికారి ఆదేశించారు. తామిద్దరికీ ఒకే గది కేటాయించాలని కోరగా, ఆ విషయం అక్కడి పరిస్థితులను బట్టి జైలు అధికారులు నిర్ణయిస్తారని కోర్టు తెలిపింది. అనంతరం వారిద్దరిని విజయవాడ జైలుకు తరలించారు. పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ధనంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని న్యాయాధికారి పి.భాస్కరరావు ప్రశ్నించారు. దానికి వారు లేదని సమాధానం ఇచ్చారు. తాము అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని వివరించారు. మూడు రోజులుగా సిట్‌ అధికారుల ముం దు విచారణకు హాజరయ్యామని, తెలియని అంశాలపై పదే పదే ప్రశ్నించారని న్యాయాధికారికి వివరించారు.

Updated Date - May 18 , 2025 | 03:42 AM