Share News

DGP Dwarka Tirumala Rao : కూటమి సర్కారు వచ్చాక 5.7%క్రైమ్‌ తగ్గింది

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:36 AM

35ఏళ్ల క్రితం తాను యూనిఫామ్‌ వేసుకున్న రోజల్లో పరిస్థితికి.. ఇప్పటికి చాలా మార్పు వచ్చిందన్న ఆయన సామాన్యుడి కోసం పూర్తి నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థ

DGP Dwarka Tirumala Rao : కూటమి సర్కారు వచ్చాక 5.7%క్రైమ్‌ తగ్గింది

  • సిఫారసు లేకుండా ఎఫ్‌ఐఆర్‌ కట్టే రోజు రావాలి

  • కసబ్‌ను విచారించా.. కొల్లంను లాక్కొచ్చా..

  • రైల్వే ఏడీజీ పోస్టింగ్‌లో పనిలేక బాధపడ్డా

  • ఏపీలో నేరాల కట్టడికి ఏఐ

  • గత ప్రభుత్వం పట్టించుకోని ఎఫ్‌ఎ్‌సఎల్‌కు జీవం

  • గంజాయి, మత్తు సవాలుపై ఉక్కుపాదం మోపాం

  • విలేకరులతో ద్వారకా తిరుమలరావు

  • నేడు ఉద్యోగ విరమణ చేయనున్న పోలీస్‌ బాస్‌

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): అన్యాయానికి గురైన సామాన్యులు పోలీసు స్టేషన్‌కు వెళితే రికమెండేషన్‌ లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే రోజు రావాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. 35ఏళ్ల క్రితం తాను యూనిఫామ్‌ వేసుకున్న రోజల్లో పరిస్థితికి.. ఇప్పటికి చాలా మార్పు వచ్చిందన్న ఆయన సామాన్యుడి కోసం పూర్తి నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థ సాకారం కావాల్సి ఉందన్నారు. ఐపీఎస్‌ అధికారిగా సమాజానికి చేసిన సేవ సంతృప్తి నిచ్చిందని.. కసబ్‌ లాంటి ఉగ్రవాదిని ఇంటరాగేట్‌ చేయడం.. కొల్లం గంగిరెడ్డి లాంటి ఎర్రచందనం స్మగ్లర్‌ను విదేశాల నుంచి తీసుకు రావడం లాంటివి వృత్తి జీవితంలో మరపు రానివని పేర్కొన్నారు. మరోవైపు రైల్వే ఏడీజీగా పనిలేక బాధపడిన రోజులూ ఉన్నాయని తిరుమల రావు నెమరువేసుకున్నారు. రాష్ట్రానికి చెందిన ద్వారకా తిరుమల రావు 1989లో ఐపీఎ్‌సకు ఎంపికై సొంత రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర పోలీస్‌ బాస్‌ హోదాలో శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గురువారం విలేకర్లతో పలు అంశాలు ముచ్చటించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో చెయ్యాల్సిన పని సక్రమంగా చేశానన్న సంతృప్తి ఉందని ద్వారకా అన్నారు. నేరాల తీరుతెన్నుల్లో మార్పులు ఎప్పటికప్పుడు పోలీసులకు సవాలుగా నిలుస్తాయని, ప్రస్తుతం మన రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగం పెంచి నేరాలు కట్టడి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ, ఏలూరు పోలీసులు ఏఐ వినియోగించి పలు కేసులు పరిష్కరించారన్నారు.


గతంతో పోలిస్తే పోలీసుల్లో జవాబుదారీతనం

రాష్ట్రమంతా పోలీసులు టెక్నాలజీ అందిపుచ్చుకొంటూ ఆయా ప్రాంతాల్లోని నేరాలను విశ్లేషించుకుని జవాబుదారీతనంతో పని చేసే దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. తాను డీజీపీ అయ్యే నాటికి గంజాయి, మత్తు, సైబర్‌ మోసాల్లాంటి సవాళ్లు ఉన్నాయన్న డీజీపీ.. వాటిలో గంజాయి, మత్తు కట్టడికి గట్టిగానే కృషి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పోలీసులకు సవాలుగా నిలిచాయని, మన రాష్ట్రంలోనూ సైబర్‌ నేరాలు మినహా ఇతరత్రా క్రైమ్‌ తగ్గుముఖం పట్టిందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో మొత్తం మీద 5.7శాతం నేరాలు తగ్గినట్లు డీజీపీ వెల్లడించారు. నేరాల కట్టడి, కేసుల దర్యాప్తు, పోలీసు సంస్కరణల్లో భాగంగా మార్చి 31లోపు లక్ష సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికి 28,500పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌)కు జీవం పోశామని, 453పాత కేసులు పరిష్కరించి రూ.7.25కోట్లు రికవరీ చేశామని వెల్లడించారు. హద్దు మీరిన సోషల్‌ సైకోలను ఏపీలో కట్టడి చేశామని, జిల్లాకొక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో గ్రేహౌండ్స్‌, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద పోలీస్‌ అకాడమీ ఏర్పాటు కాబోతోందని డీజీపీ తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మన పోలీసుల్లో జవాబుదారీ తనం పెరిగిందని, ఏపీ పోలీసు ఎప్పటికీ మంచి స్థానంలోనే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్డా, ఐజీలు పాలరాజు, అశోక్‌ కుమార్‌, రవి ప్రకాశ్‌, రవి కృష్ణ పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 04:36 AM