Ananthapuram News: దారిపై మంచు భూతం..
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:05 PM
గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
- ఉదయం 8 గంటలైనా వీడని చీకటి
- రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలు
- వాహన డ్రైవర్లకు సవాలుగా ప్రయాణం
హిందూపురం(అనంతపురం): చలితీవ్రత పెరగడంతో జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేస్తోంది. కనీసం పదడుగుల దూరంలోని మనుషులు, వాహనాలు సైతం కనిపించనంతగా పొగమంచు ఉంటోంది. ఉదయం 8 గంటలు దాటినా దీనిప్రభావం ఉంటోంది. ఈనేపథ్యంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు వంద కిలోమీటర్ల మేర ఉంది. కొడికొండ చెక్‌పోస్టు నుంచి శిర జాతీయరహదారి, మడకశిర నుంచి కళ్యాణదుర్గం రహదారి, కదిరి జాతీయరహదారి విశాలంగా ఉన్నాయి. దీంతో వాహనాలు అతివేగంగా పరుగులు తీస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డుపై ఎక్కువ భాగం పొగమంచు కప్పివేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతిఏటా డిసెంబరు, జనవరి మాసాల్లో తెల్లవారుజామున, ఉదయం జరిగే రోడ్డు ప్రమాదాలు అధిక పొగమంచు కారణంగానే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇలా జరిగింది..
- వారం కిందట మడకశిర-బెంగళూరు రహదారిపై తెల్లవారుజామున మంచు అధికంగా ఉండటంతో దారి కనిపించక వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
- గతవారం జాతీయరహదారిపై తెల్లవారుజామున బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు మంచు ప్రభావంతో మలుపు గుర్తించ లేకపోవడంతో నేరుగా వెళ్లి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్నవారు గాయపడ్డారు.
- కొద్దిరోజుల క్రితం కదిరి, అనంతపురం హైవేపై కదిరి సమీపంలో పొగమంచు ప్రభావంతో రోడ్డు దాటుతున్న మహిళ కనిపించక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

కనిపించని రోడ్లు
పొగ మంచు కారణంగా అర్ధరాత్రి దాటినప్పటి నుంచి ఉదయం 8గంటల వరకు రోడ్లు కనిపించక వాహనాల్లో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో చాలా మంది ఉదయం దాటాకే రోడ్డెక్కుతున్నారు. ఉదయం 8గంటలైనా రోడ్డుమీద కనీసం 10అడుగుల దూరం కూడా కనిపించని పరిస్థితులు హిందూపురం ప్రాంతంలో ఉన్నాయి. దీంతో హిందూపురం నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు వెళ్లే జాతీయరహదారిపై చాలా మంది డ్రైవర్లు తమ వాహనాలను నిలుపుకున్నారు.
డ్రైవర్లకు అప్రమత్తత అవసరం
శీతాకాలం మొదలవడంతో తెల్లవారుజామున కమ్ముకుంటున్న పొగమంచు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోంది. కొంతకాలంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హిందూపురం ప్రాంతంలో తెల్లవారుజామున 3గంటల నుంచి 7గంటల వరకు 12నుంచి 14డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందుకోసం వాహనాలు నడిపే డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
- అర్ధరాత్రి దాటాక ఉదయం 8గంటల వరకు దూర ప్రయాణాలు కొనసాగించకూడదు
- గంటలకు 40నుంచి 50 కి.మీ. వేగంతోనే ప్రయాణించాలి
- వాహనం నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా వాహనం లైట్లు ఆన్‌చేసి ఉండాలి
- అదేవిధంగా లోభీమ్ ఫాగ్‌లైట్లు ఉండేలా చూసుకోవాలి.
- ముఖ్యంగా జాతీయరహదారులపై ఎక్కడబడితే అక్కడ వాహనాలు ఆపకుండా పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలపాలి.
- విండ్ స్ర్కీన్ సైడ్ అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి
- ఎట్టి పరిస్థితుల్లోనూ మంచు పొర ఉన్నప్పుడు వాహనాలను ఓవర్‌టెక్ చేయకూడదు.
ప్రయాణం రద్దు చేసుకోవాలి
సాధారణంగా నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. దీంతో అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి ఉదయం 8గంటలు దాటేవరకు వాహనాల్లో వెళ్లేవారు ప్రయాణం రద్దు చేసుకుంటే మంచిది. అత్యవసరమైతే తప్పనిసరిగా నిబంధనలు పాటించి వాహనాలు నెమ్మదిగా వెళ్లాలి. తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటారు కాబట్టి, మంచు ప్రభావంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లో ఆపి, డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలి.
- మహేష్, డీఎస్పీ, హిందూపురం
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News