Gold Smuggling : రైల్లో 13 కిలోల బంగారం రవాణా

ABN , First Publish Date - 2025-01-10T05:35:20+05:30 IST

కేరళలో ఎర్నాకుళం నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి రైలులో తరలిస్తున్న 13 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12మందిని అరెస్ట్‌ చేశారు.

Gold Smuggling : రైల్లో 13 కిలోల బంగారం రవాణా

  • గుంతకల్లులో 12 మంది అరెస్టు

కర్నూలు/తాడిపత్రి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కేరళలో ఎర్నాకుళం నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి రైలులో తరలిస్తున్న 13 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12మందిని అరెస్ట్‌ చేశారు. వ్యాపార, వాణిజ్య రంగంలో రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోని బంగారం వ్యాపారానికీ ప్రసిద్ధి. మెజార్టీగా జీరో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే ఆదోనికి చెందిన 12మంది బంగారు వ్యాపారులు 13 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు(గోల్డ్‌ బార్‌) ఎర్నాకుళంలో కొనుగోలు చేశారు. కన్యాకుమారి-పూణే ఎక్స్‌ప్రె్‌సలో తిరుగు ప్రయాణమయ్యారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఆదోని వ్యాపారులు బంగారం రైలులో తీసుకెళ్తున్నారని సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఆ శాఖ సూపరింటెండెంట్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, సిబ్బంది ఆ రైలులో ప్రతి బోగీని క్షుణంగా తనిఖీ చేశారు. గురువారం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న 12 మంది ఆదోని వ్యాపారులను పట్టుకొని వారి నుంచి దాదాపు 13 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పట్టబడిన బంగారం విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. బంగారం, రవాణా చేస్తున్న వ్యాపారులను తాడిపత్రిలోని కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం పోలీస్‌ బందోబస్తుతో బంగారం, వ్యాపారులను విజయవాడకు తరలించారు. కాగా.. కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న దానిలో కొంత బంగారానికి బిల్లులు ఉన్నాయని ఆదోని వ్యాపారి ఒకరు పేర్కొనడం కొసమెరుపు.

Updated Date - 2025-01-10T05:37:56+05:30 IST