CM Chandrababu: దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:05 AM
‘‘రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.2,50,000 ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వమే బీమాసంస్థలకు చెల్లిస్తుంది.

రాష్ట్రంలోని ప్రజలందరికీ వర్తింపు
ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది
ఎన్టీఆర్ వైద్యసేవ కింద 25 లక్షలు
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం
ప్రార్థనాలయాల జోలికొస్తే వెన్నెముక విరగ్గొడతాం
గవర్నర్ ప్రసంగానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలుకూటమి ఏర్పాటు లక్ష్యమిదే: చంద్రబాబు
2026 జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం
స్కూల్స్ తిరిగి ప్రారంభించేనాటికి మెగా డీఎస్సీ
మేలో తల్లికి వందనం.. ఈ ఏడాదే అన్నదాతా సుఖీభవ
ఒక్కో రైతుకు 3 విడతల్లో రూ.20 వేల సాయం
ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ‘సూర్యఘర్’ పథకం
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘‘రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.2,50,000 ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వమే బీమాసంస్థలకు చెల్లిస్తుంది. ఆ తర్వాత రూ.25 లక్షల వరకు అయ్యే వైద్యం ఖర్చులను ఎన్టీఆర్ వైద్యసేవ కింద అందజేస్తాం’’ అని ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దగాపడ్డ రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పారు. ‘‘నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను. ఇంతకుముందు మూడుసార్లలో ఎప్పుడూ ఇంతటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. రాష్ట్ర అభివృద్ధి కోసం సకాలంలో స్పందించి కేంద్రం అందిస్తున్న సహకారం లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడేవాళ్లం. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారుచేసుకునే స్థాయికి వచ్చాం. గౌరవ సభను గౌరవించే సంస్కారం లేని పార్టీ(వైసీపీ) నేడు అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీ అంటే గౌరవం. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక. ఒక పవిత్ర దేవాలయం.’’ అని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు.. ప్రజలు
‘‘41 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం.. లేదంటే వెళ్లిపోతామనే రాజకీయపార్టీని ఎన్నడూ చూడలేదు. ప్రజలు 11 సీట్లిచ్చారు. 11 గంటలకు వచ్చారు. 11 నిమిషాలున్నారు. 11:11 నిమిషాలకు వెళ్లిపోయారు. ఈ 11 నిమిషాల్లోనే స్పీకర్‌ను, గవర్నర్‌ను అవమానించారు. రాష్ట్రానికి అది చీకటి రోజు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా గెలవలేదు. అయినాసరే అసెంబ్లీకి వస్తానంటే ఒప్పుకొంటారా? 1994లో కాంగ్రె్‌సకు మెజారిటీ రాలేదు. అందువల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సంప్రదాయాలు మర్చిపో యి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం దారుణం. అది నేనో, స్పీకరో ఇచ్చేది కాదు.. ప్రజలివ్వాలి.’’
హామీల అమలు
‘‘ఎన్ని కష్టాలున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ అమలుకు అనుక్షణం పనిచేస్తాం. సామాజిక పెన్షన్ డబ్బు ను రూ.200 నుంచి రూ.2000కు పెంచింది టీడీపీ ప్రభుత్వమే. ఆ తర్వాత రూ.3,000 నుంచి రూ.4,000 కు పెంచాం. గత ప్రభుత్వం దివ్యాంగులకు ఒక్కపైసా పెన్షన్ కూడా పెంచలేదు. మేము 8,08,570 మంది దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచాం. అనారోగ్యంతో మంచానికి పరిమితిమైన వారికి రూ.15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఏటా రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మనదే.’’
సంకల్పం మంచిదైతే కొనసాగించాలి
‘కూటమి ప్రభుత్వం వచ్చీరావడంతోనే 204 క్యాంటీ న్లు ప్రారంభించాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా దీపం పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఈ పథకానికి రూ.2,684 కోట్ల ఖర్చవుతోంది. ఇప్పటి వరకు దీని కోసం రూ.686 కోట్లు ఖర్చు చేశాం.’’
రాష్ట్రం ఎలా నష్టపోయిందంటే...
‘‘అభివృద్ధి చేయాలి...సంపద సృష్టించాలి. ఆదాయం పెంచాలి..పెంచిన ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు చేయాలనేదే మా అభిమ తం. టీడీపీ హయాంలో 2018-19లో 11.4 శాతం వృద్ధిరేటుతో 8.74 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019-20 లో 5.25 శాతంతో రూ.9.26 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ నమోదైంది. ఒకవేళ వృద్ధిరేటు 11.4 శాతం కొనసాగి ఉంటే 9.71 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ వచ్చి ఉండేది. వృద్ధిరేటు తగ్గడం వల్ల రూ.45 వేల కోట్ల జీఎ్‌సడీపీ తగ్గింది 2023-24లో 8.6 శాతం వృద్ధిరేటుతో రూ.14.22 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 2024-25లో 12.94 శాతం వృద్ధిరేటుతో రూ.16.6 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ వస్తుందని అంచనా. ఒకవేళ వైసీపీ చివరి ఏడాదిలో నమోదైన 8.6 శాతం వృద్ధిరేటే కొనసాగితే రూ.15.44 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ వచ్చేది. రాష్ట్రం జీఎస్డీపీ రూపంలో రూ.62,000 కోట్లు కోల్పోయేది. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2023-24 కు 14.23 శాతం వృద్ధి రేటుతో రూ.16.46 లక్షల కోట్ల జీఎస్డీపీ వచ్చేది.
రాష్ట్రానికి రూ.76,190 కోట్ల ఆదాయం అదనంగా వచ్చేది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. రాబోయే ఏడాది నుంచి 15% సాధించాలి. 2018-19 మార్చి నాటికి రాష్ట్రం అప్పు రూ.3,75,295 కోట్లు ఉండగా, 2024 జూన్ 4వ తేదీ నాటికి అప్పు రూ.9,74,556 కోట్లకు పెరిగింది. కేంద్రం అనేక పథకాలు ఇస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని కూడా ఉపయోగించుకోలేదు. జల్‌జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరందించాలంటే రూ.85,000 కోట్లు ఖర్చవుతుంది. ఈ పథకం ప్రకారం 45 శాతం కేంద్రం, 45 శాతం రాష్ట్రం, 10% లబ్ధిదారులు భరించాలి. కానీ, గత ప్రభుత్వం రూ.27,000 కోట్లు మాత్రమే అడిగింది. అదనంగా రూ.55,000 కోట్లు కావాలి. వాటికోసం కేంద్రాన్ని అడుగుతున్నాం.’’
రూ.80వేల కోట్లతో బనకచర్ల..
‘‘రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.2,50,000 ఆరోగ్య బీమా సౌకర్యం తెచ్చేందుకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ తర్వాత రూ.25 లక్షల వరకు అయ్యే వైద్యం ఖర్చులను ఎన్టీయార్ వైద్యసేవ ద్వారా అందజేస్తాం. బనకచర్లకు రూ.80,000 కోట్లు కావాలి. కేంద్రం, రాష్ట్రంతో కలిసి ప్రైవేటు పార్టీలను కూడా కలుపుకుని ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నాం.’’
త్వరలో మెగా డీఎస్సీ
‘‘మెగా డీఎస్సీకి త్వరలో శ్రీకారం చుడతాం. 16,384 పోస్టులకు పాఠశాలలు ప్రారంభించే లోగా నియామకం చేపట్టి శిక్షణ ఇచ్చి, పోస్టింగ్‌లు వేస్తాం. మే నెలలో తల్లికి వందనం పథకం ఇస్తాం. ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. రైతు భరోసా కింద 3 విడతల్లో ప్రతి రైతుకూ రూ.20,000 ఇస్తాం. కేంద్రం రూ.6,000 ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 ఇస్తుంది. మత్స్యకారులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా వేటలేని సమయంలో రూ.20,000 ఇస్తాం.’’
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనే లక్ష్యం..
‘‘స్వర్ణాంధ్రకు 10 సూత్రాలు ప్రతిపాదించాం. ఇందులో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనకే తొలి ప్రాధాన్యం ఇచ్చాం. స్వర్ణకారుల కార్పొరేషన్‌తో బీసీలకు రూ.896 కోట్లు విడుదలచేశాం. మత్స్యకారులకు సంబంధించి 217 జీవోను రద్దు చేశాం. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌పై తీర్మానం చేసి ఢిల్లీకి పంపాం. గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్, క్వారీల్లో వడ్డెర కులస్థులకు రిజర్వేషన్ కల్పించాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేశాం. అర్చకుల జీతాలు రూ.15,000కు పెంచాం. నిరుద్యోగ భృతి రూ.3,000 ఇస్తున్నాం. దేవాలయాల పవిత్రత కాపాడతాం. రాష్ట్రంలో ఏ ప్రార్థనాలయాల జోలికి వచ్చినా వెన్నెముక అదిరేలా చర్యలు తీసుకుంటాం.’’
ఉగాది నుంచి 4 పీ విధానం
‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు 3 సెంట్ల జాగా, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటిజా గా ఇవ్వబోతున్నాం. ఐదేళ్లలో ప్రతిఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,14,000 ఇళ్లు కట్టాం. జూన్ 12 నాటికి 5 లక్షల కొత్త ఇళ్లు కట్టి పేదలకు అంకితం చేస్తాం. ప్రతి కుటుంబానికి ఇంటిజాగా, ఇల్లు, ట్యాప్ వాటర్, టాయిలెట్, సోలార్ పవర్, విద్యుత్, గ్యాస్, ఇంటర్నెట్ లాం టి కనీస సౌకర్యాలు కల్పిస్తాం. పీ 4 పాలసీని ఉగాది రోజు ప్రారంభిస్తాం. పేదవాళ్లను ఆర్థికంగా పైకి తెస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో 7.50 లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం.’’
స్వర్ణాంధ్ర సాధిస్తాం
‘‘రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలపడం కోసం ఏ రంగంలో ఏం చేయాలన్న అంశాలతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశాం. స్వర్ణాంధ్ర-2047 సాధన కోసం ఈ రోజు ఏంచేయాలి, 3 నెలల తర్వాత ఏవిధంగా ఉండాలన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల తలసరి ఆదాయం పెంచే బాధ్యత ఎమ్మెల్యేలదే. అసాధ్యమనుకున్న అమరావతి, పోలవరం, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం ఈ 8 నెలల్లో చేసిచూపించాం. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహకరించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనమందరం గర్వపడే దేశరాజధానిగా తీర్చిదిద్దుతారు. మోదీ ప్రధాని అయ్యేనాటికి ప్రపంచం లో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను ఇప్పుడు ఐదో స్థానానికి తెచ్చారు. 2028-29 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది..’’