Share News

CID : సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ ప్రారంభం

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:22 AM

సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ మొదలైంది.

CID : సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ ప్రారంభం

  • వైసీపీ హయాంలో పలువురిపై వేధింపులు

  • అర్ధరాత్రి అరెస్టులు, థర్డ్‌ డిగ్రీలు

  • న్యాయవాది లక్ష్మీనారాయణ సహా పలువురి వాంగ్మూలాల నమోదు

  • అప్పట్లోనే కేంద్రానికి లక్ష్మీనారాయణ ఫిర్యాదు

  • నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు హోం శాఖ ఆదేశం

  • జగన్‌ జమానాలో పట్టించుకోని ఉన్నతాధికారులు

  • కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ న్యాయవాది లేఖ

  • దీంతో సీఐడీ రంగప్రవేశం

విజయవాడ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ మొదలైంది. ఆయన సీఐడీ అధిపతిగా ఉన్న సమయంలో పలువురిని అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై విచారణ ముందుకు కదిలింది. మంగళవారమిక్కడ న్యాయస్థానాల ప్రాంగణంలో లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేశారు. అనంతరం టీడీపీ మీడియా సెల్‌ ఇన్‌చార్జి దారపనేని నరేంద్ర, టీడీపీ సోషల్‌ మీడియా నేత ఽగార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకటేశ్‌, సీనియర్‌ జర్నలిస్టు కొల్లి అంకబాబు నుంచీ వాంగ్మూలం తీసుకున్నారు. సీఐడీ డీజీగా సునీల్‌కుమార్‌ ఉన్నకాలంలో పలువురు టీడీపీ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా నిబంధనలను అతిక్రమించి కస్టడీలో వారిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని లక్ష్మీనారాయణ అప్పట్లో కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం కార్యదర్శి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై విచారణ జరపాలని సీఎస్‌ డీజీపీని కోరినా.. జగన్‌ హయాంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంలో విచారణ చేపట్టాలని లక్ష్మీనారాయణ మళ్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం సునీల్‌కుమార్‌పై విచారణకు ఆదేశించింది. సీఐడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లారు. తాను ఈ ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. విజయవాడలో సీనియర్‌ జర్నలిస్ట్‌ కొల్లు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా.. కనీసం ఆయన వయసుకు గౌరవం కూడా ఇవ్వలేదని తెలిపారు.


టీడీపీ మీడియా సెల్‌ ఇన్‌చార్జి దారపనేని నరేంద్రను రాత్రిపూట అరెస్టుచేసి, సీఐడీ కార్యాలయంలో ఉంచి బెదిరించడమే కాకుండా తీవ్రంగా హింసించారని వివరించారు. ధరణికోట వెంకటేశ్‌ను అర్ధ్దరాత్రి ఇంటి గోడలు దూకి అరెస్టు చేసి తీసుకురావడమే కాకుండా హింసించారని వివరించారు. ఈ కారణంగానే తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లతో పాటు రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని వివరించారు. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారని లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు. ఆ తర్వాత నరేంద్ర, వెంకటేశ్‌ను పిలిపించి వారిని అరెస్టు చేసిన తీరును సీఐడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజున అధికారులు ఏ విధంగా వ్యవహరించారనే అంశాన్ని అడిగారు. వారి వాంగ్మూలం తీసుకుని.. నాడు అరెస్టు చేసేందుకు వచ్చిన వారిని, శారీరకంగా హింసించిన వారిని గుర్తుపడతారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. నరేంద్ర, వెంకటేశ్వరరావు, అంకబాబు వాంగ్మూలాలు ఇవీ..


దుస్తులు విప్పించి చిత్రహింసలు పెట్టారు: దారపునేని నరేంద్ర

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన బంగారం స్మగ్లింగ్‌లో అప్పటి సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉన్నట్లు వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టింగ్‌లు ఫార్వర్డ్‌ చేశానని నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. నేను గుంటూరులో ఇంట్లో ఉండగా సీఐడీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అక్కడున్న అధికారి విజయ్‌ పాల్‌తో పాటు మరో నలుగురు నన్ను దుస్తులు విప్పించి గోడ కుర్చీ వేయించారు. సీఐడీ కార్యాలయంలో నన్ను చిత్రహింసలు పెట్టారు. దానిపై న్యాయాధికారి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాను. కోర్టు నాకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. ఇదంతా అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ప్రోద్బలంతో చేశారని తర్వాత తెలిసింది.

దారుణంగా కొట్టారు: వెంకటేశ్‌

వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాజీనామా చేసినట్లుగా అప్పట్లో తప్పుడు పోస్టులు పెట్టానంటూ నాపై గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ చెంచు రామారావు, ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌, హెచ్‌సీలు బాషా, వంశీ.. మా ఇంటి తలుపులు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. నాకు కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. వేధించిన అధికారులపై గుంటూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ వేశాను. నాకు చిత్రహింసల వెనుక సునీల్‌కుమార్‌ ఉన్నారు.


హైకోర్టు క్వాష్‌ చేసింది: అంకబాబు

గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌కు అప్పటి సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందంటూ పోస్టింగ్‌లు పెట్టానని నరేంద్రతో పాటు నాపైనా కేసుపెట్టారు. 2022 సెప్టెంబరు 22న రాత్రి ఇంట్లో ఉండగా ఏడుగురు సీఐడీ పోలీసులు అక్రమంగా ప్రవేశించి.. చొక్కా కూడా వేసుకోనివ్వకుండా దుర్భాషలాడుతూ సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా మర్నాడు నన్ను అరెస్టు చేస్తున్నట్లు చెప్పి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నాకు వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్‌ ఇచ్చింది. తర్వాత హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశాను. నాపై కేసును హైకోర్టు కొట్టివేసింది. నా అరెస్టు వెనుక సునీల్‌కుమార్‌ ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Feb 12 , 2025 | 05:22 AM