Acid Attack: ప్రేమికుల దినోత్సవం రోజు అమానుష ఘటన
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:34 PM
Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజు ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే ఆగ్రహంతో యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

తిరుపతి, ఫిబ్రవరి 14: ప్రేమ పేరుతో ఎంతో మంది అబలలు బలవుతూనే ఉన్నారు. ప్రేమించలేదనే కోపంతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమికుల దినోత్సవం నాడు ఇంతటి అమానుష సంఘటన జరగడం తీవ్రం కలిచివేస్తోంది. ప్రేమించలేదనే కోపంతో ఓ యువతిపై యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా (Annamayya District) గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన గౌతమి అనే యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు యువకుడు. నిందితుడు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తించారు. యువతి చేత యాసిడ్ తాగించి.. ఆపై మొహంపై యాసిడ్ పోశాడు నిందితుడు.
అనంతరం అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రీప్లాన్డ్‌గానే నిందితుడు పురుగుల మందు తాగి మదనపల్లి ఆస్పత్రిలో చేరాడు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు న్యాయమూర్తి. అయితే గౌతమి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే బంధువులు బెంగళూరుకి తరలిస్తున్నారు. ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి నిశ్చయం అయిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ మంత్రి గన్‌మెన్ బ్యాగ్ మిస్సింగ్.. అందులో ఏమున్నాయంటే
గణేష్ అనే వ్యక్తి బ్యూటిషియన్‌గా చేస్తున్న గౌతమిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని గౌతమికి తెలుపగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ప్రేమించమంటూ యువతి వెంటపడి వేధించాడు నిందితుడు. ఎంతకీ తన ప్రేమకు అంగీకరించడం లేదనే కోపంతో రగిలిపోయాడు గణేష్. చివరకు అతడు తీసుకున్న నిర్ణయం యువతిపాలిట శాపంగా మారింది. ప్రేమికుల రోజున గౌతమిపై అటాక్ చేశాడు నిందితుడు. ఈరోజు ఉదయం గౌతమి వద్దకు చేరుకున్న గణేష్.. తనను ప్రేమించాలని మరోసారి అడిగాడు. అందుకు యువతి నిరాకరించడంతో రెచ్చిపోయాడు నిందితుడు. ముందే తెచ్చి పెట్టుకున్న యాసిడ్‌తో దాడి చేశాడు. ఆమెతో యాసిడ్ తాగించాడు. ఆపై గౌతమి మొహంపై యాసిడ్ పోశాడు. ఒక్కసారిగా యాసిడ్ పడటంతో నొప్పిని భరించలేక యువతి హాహాకారాలు చేసింది. వెంటనే తోటి వారు ఆమెను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడి అనంతరం యువకుడు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరాడు. దీంతో నిందితుడు తప్పించుకోకుండా ఆస్పత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల్లోనే గౌతమికి మేనమామతో వివాహం జరుగబోతోంది. ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో యువతి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
Read Latest AP News And Telugu News