TTD Board Meeting: టీటీడీ పాలక మండలి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలివే
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:40 PM
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుపతి, డిసెంబర్ 16: దేశంలోనీ అన్ని ఆలయాలకు టీటీడీ నుంచి ధ్వజస్థంభాలు ఇవ్వడానికి 100 ఎకరాల్లో ఉద్యానవణం ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో వివరించారు. పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి అదనంగా రూ.48 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముంబాయిలో రూ.14.4 కోట్లతో ఆలయ నిర్మాణం చేపడతామని.. అలిపిరి వద్ద 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టౌన్ షిప్‌లో వసతి సదుపాయంతో పాటు అన్నప్రసాద సముదాయం, ఇతర వసతులు భక్తులకు కల్పిస్తామని అన్నారు. కాటేజ్ డోనార్ స్కీంలో మార్పులకు ఆమోదం తెలిపామన్నారు. పద్మావతి కాలేజీలో అదనంగా 270 సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని.. . టీటీడీలోని నాలుగు కేటగిరిలలోని 60 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. తిరుపతిలోని పలు రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.
శ్రీవారి పోటులో 18 సూపర్‌వైజ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టేందుకు కమిటీ నియామకం జరిగిందన్నారు. టీటీడీలోని కాలేజ్‌లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లోని 62 మంది పరిచారక, అర్చకులు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదనంగా ఓ సన్నిధి గొల్ల నియమానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కాలిబాటలో అనుభవమున్న 18 మంది అధికారుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి
Read Latest AP News And Telugu News