GMR Mansas Aviation Edu City: ఏవియేషన్ ఎడ్యు సిటీ.. జీఎంఆర్-మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఒప్పందం..
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:18 PM
ఎడ్యు సిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమిని ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జీఎంఆర్ - మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యు సిటీకి సంబంధించి..
విశాఖపట్నం, డిసెంబర్ 16: ఎడ్యు సిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమిని ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జీఎంఆర్ - మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యు సిటీకి సంబంధించి ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయామన్నారు. కానీ, సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఇప్పుడు మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఐటీ కంపెనీలన్నీ భీమిలికి క్యూ కట్టాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జీఎంఆర్.. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ అని.. ప్రపంచంలో గొప్ప పారిశ్రామిక వేత్తగా ఆయన ఎదిగారని కొనియాడారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును జీఎంఆర్ కట్టారన్నారు. ప్రపంచంలో సివిల్ ఏవియేషన్‌లో తెలుగువారు 25 శాతం ఉండాలనేదే తమ ఆశగా పేర్కొన్నారు మంత్రి లోకేష్. ఈ కారణంగానే. విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ కూడా భూమిని ఉచితంగా ఇచ్చిందన్నారాయన. ఇక్కడే ఎడ్యుసిటీని ఏర్పాటు చేయాలని మాన్సాస్ ట్రస్ట్ వారు కోరారని.. కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో భూములు ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు. ఏవియేషన్ నిర్మాణ భాగాల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చైనా క్లస్టర్స్ బేస్‌గా వెళ్తోందని.. సక్సెస్ సాధించిందని పేర్కొన్నారు. అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేశామన్నారు మంత్రి లోకేష్. ఒక్క రూపాయికి భూములు ఇస్తున్నామన్నారు. అందుకే.. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద సంస్థలు విశాఖకు వస్తున్నాయని వివరించారు మంత్రి.
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశామన్నారు. మాక్ అసెంబ్లీ, మినీ రాజ్యాంగం కాన్సెప్ట్‌ను ఆయనకు చూపించామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కాన్సెప్ట్ తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. మిస్సైల్ లాంటి యువ నాయకత్వానికి.. జీపీఎస్ లాంటి పెద్దలు సూచనలు ఇస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధితో పాటు.. మౌలిక వస్తువుల మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, సీనియర్ రాజకీయ నాయకులు మార్గనిర్దేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పందం..
మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో జీఎంఆర్, మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ చైర్మన్ జి.బి.వి రాజులు ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ఎడ్యు సిటీ ప్రాజెక్టు అభివృద్ధి చేయనున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Also Read:
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసు.. లూథ్రా బ్రదర్స్ అరెస్ట్
పోలీసుల అదుపులో మావోయిస్టు అధినేత
అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్