TTD Board Meeting: టీటీడీ పాలక మండలి సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:09 PM
టీటీడీ పాలక మండలి మంగళవారం తిరుమలలో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను టీటీడీ బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.
తిరుమల, అక్టోబర్ 28: ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో అవకతవకల నిర్దారణ కేసును ఏసీబీకి అప్పగించాలని టీటీడీ నిర్ణయించిందని ఆ ధార్మిక సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. మంగళవారం తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు విలేకర్ల సమావేశంలో వివరించారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద వితరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. రూ. 37 కోట్లతో ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దాతలు సహాయంతో రూ. 14 కోట్లతో చెన్నైలోని శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా టీటీడీ గోశాల నిర్వహణపై కమిటీని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పద్మావతి అతిథి గృహం ప్రాంతంలోని గదుల అద్దె క్రమబద్దీరణకు కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ నగరంలో రూ. 30 కోట్ల నిధులతో శ్రీవారి ఆలయం నిర్మాణం చేపడతామన్నారు. అందుకు రూ. 10 కోట్ల నిధులు దాతలు ద్వారా సేకరిస్తామని పేర్కొన్నారు. రూ. 25 కోట్లతో కాణిపాకంలో అతిధి గృహంతో పాటు రెండు కళ్యాణ మండపాలు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.
ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు ఒంటిమిట్టలో పవిత్ర వనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే వేదిక్ యూనివర్సిటీ వీసీ సదా శివమూర్తిని తొలగించాలని నిర్ణయించామన్నారు. టీటీడీ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం అందించాలని ప్రభుత్వానికి సిఫార్స్ చేసినట్లు వివరించారు. 10 రోజుల పాటు శ్రీవారి భక్తులకు వైకుంఠం ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. వైకుంఠం ద్వారా దర్శనం కోసం టికెట్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.. ప్రజలకు అధికారులు హెచ్చరిక
ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు: నారా లోకేశ్
For More AP News And Telugu News