Share News

Cyclone Montha: ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు: నారా లోకేశ్

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:54 PM

సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లే ముందే మొంథా తుపాన్‌పై సమీక్ష నిర్వహించారని మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటి వరకు ఆయన 12 సార్లు ఈ తుపాన్‌పై సమీక్ష చేశారని వివరించారు.

Cyclone Montha: ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు: నారా లోకేశ్

అమరావతి, అక్టోబర్ 28: మొంథా తుపాన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈకి వెళ్లక ముందు సమీక్ష నిర్వహించారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనిత తెలిపారు. ఈ తుపాన్ పై ఇప్పటి వరకు ఆయన 12 సార్లు సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రులు లోకేశ్, అనిత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ తుపాన్ ప్రభావం 40 లక్షల మందిపై ఉందన్నారు. ఎక్కడా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్నదే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.


ఈ తుపాన్ ప్రభావం ఉన్న 1,320 గ్రామాల ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించామన్నారు. 1906 షెల్టర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించామని.. వాటిని షెల్టర్లుగా మార్చామని వివరించారు. ఈ విపత్తు సమయంలో 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాత్రి 11.30 గంటలకు ఈ తుపాన్ ల్యాండ్ ఫాల్ అవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.


తుపాన్ దిశను బట్టి సిబ్బందిని మోహరించామన్నారు. గతంలో పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు సీపీడబ్ల్యూ బృందాలను ఏర్పాటు చేసి జనరేటర్లు సిద్ధం చేశామని మంత్రి నారా లోకేశ్ గుర్తు చేశారు. అలాగే సెల్ టవర్ల వద్ద జనరేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం రాత్రి అంతా ఆర్టీజీఎస్‌లో ఉండి తుపానును మానిటరింగ్ చేస్తామన్నారు.


ఇక ప్రతి రెండు గంటలకు ఒకసారి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. తుపాన్ తీరం దాటిన అనంతరం సహాయ, పునరావాస చర్యలను సకాలంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీచ్‌లు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ల వద్దని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు. తమకు సహకరించాలని ప్రజలకు మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీచ్‌లకు వెళ్లి వీడియోలు చేయడం సరికాదని పేర్కొన్నారు.


తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇప్పటికే తాము మాట్లాడామన్నారు. వందలాది గ్రామాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని.. వారిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రజలు సైతం చెట్లు పడిపోయిన విషయాన్ని ఫొటోలు తీసి పంపితే వెంటనే వాటిని క్లియర్ చేస్తున్నామని వివరించారు. తుపాన్ అధిక ప్రభావం ఉన్న గ్రామాల్లో 10 నిమిషాల్లో రహదార్లు క్లియర్ చేయాలని సీఎం చంద్రాబాబు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఇప్పటికే తొలగించామన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు.


వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్‌లు పంపుతున్నామని తెలిపారు. రియల్ టైమ్‌లో రిపోర్టులను ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని చెప్పారు. ఇక రాత్రి 11.30 గంటల నుంచి రిలీఫ్ రీహ్యాబిలిటేషన్ వివరాలు సైతం ప్రధానికి తెలియజేస్తామన్నారు. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఉండేలా వారితో ఇప్పటికే మాట్లాడినట్లు వివరించారు. అందరూ సిద్ధంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని మంత్రులు స్పష్టం చేశారు. శాటిలైట్ల ద్వారా కింద ఎంత నీరు ఉందో కూడా చూసే అవకాశం ఉందన్నారు. అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఇప్పటికే తీరానికి చేరుకున్నారని మంత్రులు నారా లోకేశ్, అనిత వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొంథా తుపాన్‌పై ఆరా.. రైల్వే మంత్రి కీలక ఆదేశాలు

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 07:22 PM