Share News

Mentha Cyclone: మొంథా తుపాన్‌పై ఆరా.. రైల్వే మంత్రి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 28 , 2025 | 03:54 PM

మొంథా తుపాన్‌‌పై ఉన్నతాధికారులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

Mentha Cyclone: మొంథా తుపాన్‌పై ఆరా.. రైల్వే మంత్రి కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: మొంథా తుపాన్ ప్రభావ ప్రాంతాల్లోని ప్రతి రైల్వే విభాగంలో అత్యవసర నియంత్రణ కేంద్రాలు (వార్ రూమ్స్) తక్షణమే ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. రైల్వే వ్యవస్థలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ తుపాన్ తూర్పు తీరంపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం న్యూఢిల్లీలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.


తుపాన్ వాస్తవ పరిస్థితులను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అయితే ఈ తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజనుల్లో అవసరమైన సామగ్రి, యంత్ర పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకోనేలా సిబ్బందిని ఆదేశించాలని సూచించారు.


ఈ తుపాన్‌ ప్రభావం కారణంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రైళ్ల రాకపోకలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR), సౌత్ సెంట్రల్ కోస్ట్ రైల్వే (SCoR), సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జోన్లలో అత్యవసర పరిస్థితులపై వెంటనే స్పందించేందుకు తగిన వనరులు, సిబ్బందితోపాటు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణ, ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విభాగం సమన్వయంతో ముందుగానే సిద్ధమై ఉంటే.. ఈ తుపాన్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించ వచ్చునని అభిప్రాయపడ్డారు. రైల్వే వ్యవస్థలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో అగ్రనేత నేత లొంగుబాటు.. మావోయిస్టులకు మళ్లీ దెబ్బ

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు..

For More National News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 04:37 PM