Operation Kagar: మరో అగ్రనేత నేత లొంగుబాటు.. మావోయిస్టులకు మళ్లీ దెబ్బ
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:16 PM
తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చేపట్టిన కీలక ఆపరేషన్ సక్సెస్ అయింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్నతోపాటు కీలక నేత బండి ప్రకాశ్ మరికాసేపట్లో డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చేపట్టిన కీలక ఆపరేషన్ సక్సెస్ అయింది. మావోయిస్టు పార్టీ ఐడియాలజీ రూపొందించిన పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్నతోపాటు ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాశ్ తెలంగాణ ప్రభుత్వం ఎదుట మంగళవారం లొంగిపోనున్నారు. మరికాసేపట్లో వీరిద్దరు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగిపోవడం వల్ల మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చర్చ నడుస్తోంది.
మరోవైపు.. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌తోపాటు దాదాపు 200 మంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఆ పార్టీ మరో కీలక నేత ఆశన్నతోపాటు పలువురు మావోయిస్టులు సైతం ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ఈ సందర్భంగా భారీగా ఆయుధాలను వారు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు.
2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. దీంతో మావోయిస్టులు లొంగిపోయి.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారికి కేంద్రం పిలుపు నిచ్చింది. ఇంకోవైపు మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించగా.. వేలాది మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరణించిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు సైతం ఉన్నారు. అలాంటి వేళ మావోయిస్టు పార్టీ దాదాపుగా బలహీనంగా మారింది. అయితే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి.. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమంటూ మావోయిస్టులు చేసిన ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశంలో కేవలం 11 జిల్లాలకు మాత్రమే మావోయిస్టులు పరిమితమయ్యారని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తన బావ సత్యనారాయణ పార్థీవదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు..
For More TG News And Telugu News