Share News

Tirupati: కాలేజ్‌ భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థి.. పరిస్థితి విషమం

ABN , Publish Date - Dec 10 , 2025 | 10:29 AM

తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్ భవనంపై నుంచి పడి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.

Tirupati: కాలేజ్‌ భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థి.. పరిస్థితి విషమం
Tirupati

తిరుపతి, డిసెంబర్ 10: నగరంలోని చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి కాలేజ్ భవనంపై నుంచి వెనుక వైపున ఉన్న పైపుల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పి సదరు విద్యార్థి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుర్తించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పై నుంచి కింద పడటంతో విద్యార్థి చెవి, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.


తిరుపతి అమరా ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స అందుతున్నట్లు సమాచారం. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మహిధర్ రెడ్డిగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలానికి చెందిన వ్యక్తిగా సమాచారం. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది సమాచారం అందించింది. వెంటనే వారు ఆస్పత్రికి చేరుకుని తమ బిడ్డ పరిస్థితి గురించి తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


విషయం తెలిసిన వెంటనే చంద్రగిరి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు విద్యార్థి భవనంపై నుంచి పైపులు పట్టుకుని కిందకు ఎందుకు దిగాల్సి వచ్చింది?... అసలు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కాలేజ్ విద్యార్థి ఒక్కసారిగా పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడటంతో తోటి విద్యార్థులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు

వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 10:50 AM