Share News

Tirumala Laddu Controversy: ఆ కాంట్రాక్ట్‌ వెనక టీటీడీ కీలక వ్యక్తులు.. త్వరలో మరిన్ని అరెస్ట్‌లు

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:27 PM

Tirumala Laddu: తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అవ్వగా.. త్వరలోనే మరికొందరి అరెస్ట్‌లు ఉంటాయని సమాచారం.

Tirumala Laddu Controversy: ఆ కాంట్రాక్ట్‌ వెనక టీటీడీ కీలక వ్యక్తులు.. త్వరలో మరిన్ని అరెస్ట్‌లు
Tirumala Laddu Controversy:

అమరావతి, ఫిబ్రవరి 10: తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ బృందం దూకుడు పెంచింది. మరికొందరు కీలక వ్యక్తుల ప్రమేయంపై సీబీఐ ఆధ్వర్యంలోని సీట్ టీమ్ ఆరా తీస్తోంది. గత రాత్రి అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని తిరుపతి కోర్ట్‌లో సిట్‌ టీం పిటిషన్లు దాఖలు చేసింది. బోలె బాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్‌ డెయిరీ ఎండీరాజు రాజశేఖరన్‌లను సిట్ అరెస్ట్ చేసింది. ఈ నలుగురిని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఆధ్వర్యంలోని సీట్ టీమ్ కోరింది. తదనంతర దర్యాప్తులో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే అంశంపై సీట్ బృందం సమావేశమైంది.


దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో త్వరలో మరిన్ని అరెస్ట్‌‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీబీఐ బాస్ అనుమతి తీసుకున్న వెంటనే రేపో మాపో మరికొంతమంది కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇప్పించడం వెనుక ఉన్న వ్యక్తులు సమాచారాన్ని సిట్ బృందం తెలుసుకుంది. టీటీడీ గత పాలకవర్గంలోని కీలక వ్యక్తులు ఒకరిద్దరు ఏఆర్ డెయిరీ పేరు సిఫార్సు చేశారని సీట్‌కు కీలక సమాచారం అందింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నివేదిక ఆధారంగా.. దీనిపై దర్యాప్తుకు సిట్ బృందాన్ని నియమించారు. ఈ సిట్‌ దర్యాప్తు సీఐడీ ఆధ్వర్యంలో జరగాలని వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని నియమించారు.

RGV CID Enquiry: సీఐడీకీ షాకిచ్చిన ఆర్జీవీ.. విచారణకు డుమ్మా


ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టిన సిట్ టీమ్.. గత రాత్రి నలుగురిని అరెస్ట్ చేసింది. అయితే ఈ నలుగురిని తమ కస్డడీకి ఇవ్వాల్సిందిగా తిరుపతి కోర్టులో సిట్ టీమ్ పిటిషన్ వేసింది. ఎందుకు వీళ్లను తమ కస్టడీకి ఇవ్వాలి అనే అంశంపై కూడా పిటిషన్‌లో స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణలో ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని, కానీ వీరివద్ద చాలా కీలక ఆధారాలు ఉన్నాయని.. వీళ్లను విచారిస్తే కేసు దర్యాప్తులో మరింత పురోగతి వస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. అలాగే తదనంతర దర్యాప్తులో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై కూడా సిట్ బృందం సమావేశమైంది. త్వరలో మరిన్ని అరెస్ట్‌లు జరుగుతాయని.. ఇప్పటికే పది మంది సిట్ బృందం అదుపులో ఉన్నట్లు సమాచారం.


దీంతో పాటు ఏఆర్ డెయిరీని ముందు పెట్టి దీని వెనక వైష్ణవి డెయిరీ ఉండి నెయ్యిని సరఫరా చేసిందని, ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం వెనక కల్తీ జరిగింది అనేది సిట్ బృందం ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది. కర్ణాటకలో ఉన్న నంది డెయిరీ శ్రీవారి లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యిని పంపుతుందని సమాచారం ఉన్నప్పటికీ ఏఆర్ డెయిరీకి ఈ కాంట్రాక్టు ఇప్పించడం వెనక గత టీటీడీ పాలకవర్గంలోని కొంతమంది కీలక వ్యక్తులు దీని వెనక ఉన్నారని సిట్‌ బృందానికి స్పష్టమైన సమాచారం అందింది. దీంతో ఆ దిశగానే సిట్ టీం దర్యాప్తు చేపడుతోంది.


ఇవి కూడా చదవండి...

Mastansai Case: మస్తాన్ సాయి కేసు.. ఏకంగా పోలీసులతోనే బేరసారాలు

అదొక్కటి గుర్తుపెట్టుకోండి.. స్టూడెంట్స్‌కు మోడీ సజెషన్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:41 PM