AP Liquor Case: ముగిసిన సోదాలు.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ABN , Publish Date - Sep 04 , 2025 | 09:51 PM
మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు చేపట్టింది.
తిరుపతి: మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ఈ సోదాలు ముగిసినట్లు తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ పేర్కొన్నారు. సిట్ విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీ వివరాలతో పాటుగా.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం ఆరు కంపెనీలు ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఆ కంపెనీల అడ్రస్ సైతం ట్యాలీ అయ్యిందన్నారు. విచారణకు చెవిరెడ్డి కుటంబం సహకారం అందించిందని ఎస్పీ వివరించారు.
అనంతరం.. విజిలెన్స్ సోదాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణ నిమిత్తం నిన్న(గురువారం)విజిలెన్స్ అధికారులు తమ నివాసానికి రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ ఉండటంతో నిన్న(గురువారం) అందుబాటులో లేమని తెలిపారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి సిట్ అధికారులు ఇంట్లో సోదాలు నిర్వహించారని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులకు పూర్తి సహకారం అందించినట్లు మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ జిల్లాలో 9 బార్లకు రీ నోటిఫికేషన్
అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..