AP Liquor Scam: మిథున్ రెడ్డిని కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో సిట్ పిటిషన్
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:01 PM
మద్యం కుంభకోణం కేసులో మరోసారి కోర్టును సిట్ అధికారులు ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఏ-4 నిందితుడు ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి అప్పగించాలంటూ ఇవాళ (బుధవారం) కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారించేందుకు ఎంపీ మిథున్ రెడ్డిని తమకు ఐదు రోజులపాటు అప్పగించాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం ఇంకా బెయిల్ రాలేదు.
అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తాను ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ గతంలో మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు సైతం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలంటూ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓటు వేసిన అనంతరం ఆయన లొంగిపోయారు. ఇంకోవైపు మద్యం కుంభకోణం కేసులో భారీగా నగదుతోపాటు ఆస్తులను సైతం ప్రభుత్వ అధికారులు జప్తు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
భూమనకు పోలీసులు నోటీసులు జారీ..
ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన
For More AP News And Telugu News