Alipiri Police: భూమనకు పోలీసులు నోటీసులు జారీ..
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:00 PM
తిరుపతి సమీపంలోని అలిపిరిలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురవుతుందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ డిప్యూటీ ఈవో అలిపిరి పోలీసులను ఆశ్రయించారు.
తిరుపతి, సెప్టెంబర్ 17: తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి బుధవారం అలిపిరి పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో భూమనకు స్పష్టం చేశారు.
అయితే కొద్ది రోజుల పాటు తాను బిజీగా ఉంటానని ఈ సందర్భంగా పోలీసులకు ఆయన స్పష్టం చేశారు. వీలు చూసుకుని రావాలంటూ భూమనకు ఎస్ఐ అజిత సూచించారు. వచ్చే మంగళవారం అంటే.. సెప్టెంబర్ 23వ తేదీన తాను ఈ విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ ఆయన ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో ఆయనకు అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగింది. టీటీడీపై దుష్ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ ధార్మిక సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది: సీఎం రేవంత్
ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన
For More AP News And Telugu News