Share News

CM Revanth Reddy: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది: సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 17 , 2025 | 10:29 AM

ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజా పాలన తెచ్చుకున్నామన్నారు.

CM Revanth Reddy: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది: సీఎం రేవంత్
CM Revanth Reddy At Gun Park

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజా పాలన తెచ్చుకున్నామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. బుధవారం పబ్లిక్ గార్డెన్స్‌లోని గన్ పార్క్‌లో అమర వీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు అని గుర్తు చేశారు. బానిస సంకెళ్లు తెంచడానికి అమరులైన వారికి ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించారు.


అదే ప్రభుత్వ లక్ష్యం..

సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వంలో తెలంగాణ రోల్‌మోడల్‌ అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకోవాలంటే విద్యే మార్గమమని చెప్పారు. గొప్ప లక్ష్యాలతో యంగ్‌ ఇండియా స్కూల్స్‌కి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


మహిళలకు పెద్ద పీట..

భవిష్యత్‌ తెలంగాణ కోసం విద్యపై భారీ పెట్టుబడి పెట్టామన్నారు. విద్యతో పాటు క్రీడలకు సైతం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులుగా చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.


రైతుల సంక్షేమం విషయంలో..

తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పారు. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తున్నామన్నారు. త్వరలో విద్యా పాలసీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ ద్వారా రైతులకు విముక్తి కల్పించామని గుర్తు చేశారు. రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. రైతుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం రేవంత్ కుండ స్పష్టం చేశారు. రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని వివరించారు.


ఏకైక రాష్ట్రం తెలంగాణ..

వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో ఉందని స్పష్టం చేశారు. దేశంలో పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా అని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కుండ బద్దలు కొట్టారు. కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ వాటా కోసం కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు సైతం వినిపిస్తున్నామని పేర్కొన్నారు.


గేట్ ఆఫ్ వరల్డ్‌గా..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేసి ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. 2027 డిసెంబర్‌ నాటికి ఈ టన్నెల్‌ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను గేట్‌ ఆఫ్‌ వరల్డ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2047 నాటికి 3 ట్రిలయన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.


ఎన్ని అడ్డంకులు వచ్చినా..

వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన చేసి హైదరబాద్‌ను సుందరంగా మార్చుతామన్నారు. మూసీ చుట్టూ జీవిస్తున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తామని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తామని చెప్పారు.


డిసెంబర్‌లో మూసి అభివృద్ధి పనులు..

మూసీకి ఇరు వైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తామన్నారు. అదే విధంగా మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


పట్టి పీడిస్తున్న..

తెలంగాణను పట్టి పీడిస్తున్న మత్తు మాఫియాను తరిమికొడతామన్నారు. నగరాల్లోనే కాదు.. పట్టణాలు, గ్రామాలకు కూడా గంజాయి విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అండగా నిలబడితే మత్తు మాఫియాను తరిమికొడతామన్నారు. గతంలో కొందరు హైదరాబాద్‌ను గేట్‌ వే ఆఫ్‌ డ్రగ్స్‌గా మార్చారని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.


మాఫియా వెనుక ఎవరున్నా జైలుకు పంపుతాం..

డ్రగ్స్‌ మాఫియా వెనుక ఎవరున్నా వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఫామ్‌ హౌస్‌ల్లో జరిగే డ్రగ్‌ పార్టీలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. డిసెంబర్‌లో 2047 తెలంగాణ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామని తెలిపారు.

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్‌ సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం ఘన నివాళి

ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన

Read Latest Telangana News and National News

Updated Date - Sep 17 , 2025 | 10:56 AM