Nagaravanam Park Incident In Chittoor: అత్యాచార నిందితులను నడి రోడ్డుపై లాక్కెళ్లిన పోలీసులు
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:57 PM
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నడిరోడ్డుపై లాక్కెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు, అక్టోబర్ 03: చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. ఆ తర్వాత చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచి.. వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత చిత్తూరు నగరంలోని నడి రోడ్డుపై నడిపించుకుంటూ నిందితులను కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.

సెప్టెంబర్ చివరి వారంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మురకంబుట్ట నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు యువకులు దాడి చేసి.. వారి వద్ద నుంచి నగదు దొంగలించారు. ఆ తర్వాత బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు పరారయ్యారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక.. తన తల్లిదండ్రులకు వివరించింది. వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగసముద్రంకు చెందిన హేమంత్, మురకంబుట్ట అగ్రహారానికి చెందిన కిశోర్, మహేశ్‌లు.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో శుక్రవారం నిందితులను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.
నగరవనం పార్కుకు ఒంటరిగా వచ్చే మహిళలు, ప్రేమ జంటలు లక్ష్యంగా చేసుకుని ఈ ముగ్గురు నిందితులు బెదిరింపులకు పాల్పడే వారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రేమ జంటను తమ సెల్ ఫోన్లు ద్వారా చిత్రీకరించడం.. వాటిని కుటుంబసభ్యులకు చూపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడే వారంటూ ఇప్పటికే వారిపై ఫిర్యాదులు అందాయి.
అలా ప్రేమ జంటల వద్ద నుంచి నగదు, నగలు దోచుకోవడంతోపాటు యువతులు, బాలికలపై అత్యాచారం జరిపే వారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలో వారి సెల్ ఫోన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని.. వాటిలోని ఫొటోలు, వీడియోలను సైతం పరిశీలిస్తున్నారు. కాగా, నిందితులపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దోపిడి, హత్యాయత్నం, కిడ్నాప్ కింద పలు కేసులు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయినట్లు వైద్యుల నివేదిక స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫెవిక్విక్.. చేతులకు అంటుకుపోయిందా?.. ఇవిగో సింపుల్ చిట్కాలు
తలలో పేలు పోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు..
For More AP News And Telugu News