Share News

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:23 AM

గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

  • ఆ బ్యాంకు మిగులు నిధులపై చంద్రబాబు దృష్టి!

  • వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేయగా మిగిలే మొత్తాన్ని తీసుకునే యోచన

  • ఇప్పటికే ప్రధాని మోదీ,కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చర్చలు

  • ప్రస్తుతం 51,364 కోట్ల మిగులు

  • ఇందులో 40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత!

  • మిగతా 40 వేల కోట్లు కాంట్రాక్టు సంస్థల నుంచి సమీకరణ

‘తెలుగు తల్లికి జలహారతి’.. రాష్ట్రం దశ, దిశ మారుస్తుందని సీఎం చంద్రబాబు దృఢంగా విశ్వసిస్తున్నారు. దీనిని సాకారం చేయడానికి ప్రపంచ బ్యాంకు తోడ్పాటు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ బ్యాంకు వివిధ ప్రాజెక్టుల కింద మన దేశానికిచ్చిన రుణంలో మిగిలిపోయిన నిధులను ఈ పథకానికి మళ్లించే అంశంపై ఆయన దృష్టిసారించారు. అంచనా వ్యయం రూ.80,112 కోట్లలో 40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో కార్యాచరణకు నడుం బిగించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇతర రాష్ట్రాలతో లింకు పెట్టుకోకుండా.. నదుల అనుసంధానం కింద కాకుండా.. రాష్ట్ర అంతర్గత అనుసంధానం ప్రాజెక్టుగా దీనిని ఆయన ప్రతిపాదిస్తున్నారు. నదుల అనుసంధానం అంటే పొరుగు రాష్ట్రాల అనుమతులు కూడా కావాలి. అంతర్గత అనుసంధానానికి ఆ అవసరం లేదు. అందుబాటులో ఉన్న మిగులు జలాలను కరువు సీమకు మళ్లించడంవరకే ఇది పరిమితం. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారు. ప్రాజెక్టు డాక్యుమెంటును తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను త్వరలో పంపనున్నారు. ఇంకోవైపు.. నిధుల సాధనపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రపంచ బ్యాంకు మిగులు నిధులను ఈ ప్రాజెక్టుకు సాధించడానికి ఆయన పూనుకున్నారు.


వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి సమీకరించిన నిధుల్లో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మొత్తం సుమారు ఆరు బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు అంచనా. రూపాయల్లో ఈ మొత్తం 51,364 కోట్ల వరకూ ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టు కోసం సేకరించిన రుణంలో ఖర్చుకాకుండా మిగిలే నిధులను మరో ప్రాజెక్టుకు వినియోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ పద్దు కింద ఉన్న నిధులను గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కోసం సాధించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పటికే దీనిపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్వరూపం ఎలా మారుస్తుందో.. రాష్ట్రానికి ఎంత ఉపయోగకరమో వారికి వివరించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.40 వేల కోట్ల వరకూ కేటాయించడానికి కేంద్రం సుముఖంగా ఉంది. ప్రపంచ బ్యాంకు మిగులు నిధుల నుంచే ఈ మొత్తం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విషయంలో ప్రపంచ బ్యాంకు వర్గాలు కూడా సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తుందని, మంచి ఆలోచనలతో ముందుకు వస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం నుంచి కొంత సానుకూలత వ్యక్తమైన తర్వాతే ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు వివరాలను బహిర్గతం చేశారు. ప్రస్తుతం దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన జరుగుతోంది. 3 నెలల్లో సిద్ధంచేసి కేంద్రానికి పంపి.. అనుమతి వచ్చిన 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని సీఎం చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు సాగిస్తున్న ఆయన.. కేంద్రం నుంచి నిధులు సాధించి తెస్తారన్న గట్టి నమ్మకంతో అధికార వర్గాలు ఉన్నాయి.


  • మిగతాది భారీ కాంట్రాక్టు కంపెనీల నుంచి..!

కేంద్రం 40 వేల కోట్లు ఇవ్వగా.. ఇంకా మరో రూ.40 వేల కోట్లు జలహారతి ప్రాజెక్టుకు సమీకరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల పనులు చేపట్టే భారీ కాంట్రాక్టు సంస్థల నుంచి ఈ నిధులు సేకరించి వాటికి పాతికేళ్లపాటు ఏటా కొంత మొత్తం చెల్లించే నమూనా అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమికంగా అనుకుంటోంది. ఒక పెద్ద కాంట్రాక్టు కంపెనీ ఇప్పటికే కొంత ఆసక్తి చూపి అధ్యయనం చేస్తోంది. ఒక సంస్థ వల్ల కాకపోతే రెండు, మూడు ఏజెన్సీలను కలిపి కన్సార్షియంగా ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని సీఎం అనుకుంటున్నారు.

  • ప్రకాశం బ్యారేజీకి ప్రత్యామ్నాయం!

జలహారతి ప్రాజెక్టు తొలిదశలో పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి జలాలను విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీలోకి తరలించాలని.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువకు తీసుకెళ్లి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయరును నింపాలని తొలుత అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. బ్యారేజీలోకి కాకుండా మరో మార్గం ద్వారా నీటిని తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువ ఉంది. అందులోకి గోదావరి జలాలను తీసుకెళ్లాలి. ఇప్పుడు సాగర్‌ కాలువ ప్రవాహ సామర్థ్యం పది వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిని 30 వేల క్యూసెక్కులకు విస్తరించాలని తాజాగా భావిస్తున్నారు. గోదావరి జలాలు కలిసే చోటు నుంచి కాలువను వెడల్పు చేయాలనేది యోచన.

Updated Date - Jan 01 , 2025 | 04:23 AM