Chandrababu Slams YSRCP: అసెంబ్లీలో చర్చకు సిద్ధమా.. వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు సవాల్..
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:43 PM
సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరెగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపైనా, వివేకా హత్య, గులకరాయి డ్రామాపైనా చర్చకు మీరు సిద్ధమా అని బోయినపల్లి ప్రజావేదిక సభలో వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు.
అన్నమయ్య జిల్లా, బోయినపల్లి: సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బోయినపల్లిలో పర్యటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ సారి అన్నమయ్య జిల్లాకు విచ్చేసారు. ప్రజలకు పింఛన్ల పంపిణీ అనంతరం ఆయన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. 30 ఏళ్లుగా ఒక మిషన్‌లా పనిచేస్తూనే ఉన్నా. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. మన ప్రభుత్వంలో జీతాలతో పాటు పెన్షన్లు కూడా సకాలంలో ఇస్తున్నాం. అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయి. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని అన్నారు. కొంతమందికి అధికారం ఇస్తే సొంత పనులకు వినియోగించుకున్నారని వైసీపీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరెగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపైనా, వివేకా హత్య, గులకరాయి డ్రామాపైనా చర్చకు మీరు సిద్ధమా అని వైసీపీకి సవాల్ విసిరారు.
ఫేక్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. సీఎం
బోయినపల్లి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు అమలు జరిగిన తీరును ఎండగట్టారు. గత ప్రభుత్వం అర్హులకు పెన్షన్ ఇవ్వకుండా.. వాళ్ల కార్యకర్తలకు ఇచ్చుకున్నారని విమర్శించారు. అన్ని సంక్షేమ పథకాలు వారి కార్యకర్తలు, కావలసిన వారికోసమే ఇచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదలను దోచుకునేవారు. కానీ, టీడీపీ ఎప్పుడూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేసింది. రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే నా ఆశయం అని స్పష్టం చేశారు.
చర్చలకు సిద్ధమా..?
2024 ఎన్నికల్లో పవన్, బీజేపీతో కలిసి పోటీ చేశాం. కూటమికి ప్రజలు అద్భుత విజయం అందించారు. అప్పు చేసి పప్పు కూడు తింటే చిప్పే మిగులుతుంది. అప్పులు చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడదు. ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యం. సంపద సృష్టించి ఆదాయం పెంచి సంక్షేమం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరిపడిన వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపైనా.. వివేకా హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మందు బాబులకు మరో గుడ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి..
వైఖరి మార్చుకో వైఎస్ జగన్: ఎమ్మెల్యే యార్లగడ్డ
For More AP News And Telugu News