CM Chandrababu : ఏపీకి పూర్వవైభవం తెస్తాం
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:05 AM
కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
గత పాలనలో అంతా విధ్వంసం
వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం
కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి ఆదుకుంది
ఉక్కుకు 11,440 కోట్ల సాయం
రైల్వే జోన్‌కు మోదీ శంకుస్థాపన
అమరావతి, పోలవరం పూర్తిచేస్తాం
ఏపీ పునర్నిర్మాణంలో అమిత్ షా సూచన సంతృప్తినిచ్చింది: సీఎం
రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అద్భుతంగా సహకరిస్తోంది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలో భాగస్వామి అయ్యేందుకు మరింత తోడ్పాటు అవసరం. రాష్ట్రంలోనూ 2047 విజన్ లక్ష్యంగా పెట్టుకున్నాం.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, వ్యవస్థలు దెబ్బ తిని వెంటిలేటర్‌పై ఉందని.. ప్రజలు 93 శాతం స్ర్టైక్ రేట్‌తో ఇచ్చిన విజయంతో కేంద్రం ఆక్సిజన్ అందించి ఆదుకుందన్నారు. వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం కానీ ఇంకా కోలుకోలేదన్నారు. ఎన్నికల ముందు పది లక్షల కోట్లకు పైగా అప్పులు.. రాజధాని పూర్తిగా విధ్వంసం.. కొట్టుకుపోయిన పోలవరం డయా ఫ్రమ్ వాల్.. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. అమరావతికి 15 వేల కోట్ల సాయం కేంద్రం నుంచి అందడంతో రాజధాని పనులు వేగవంతమయ్యాయని, పోలవరం డయా ఫ్రమ్ వాల్ పనులు తాజాగా మొదలయ్యాయని, ఈ రెండింటినీ పూర్తి చేసి తీరుతామన్నారు. ఆదివారం విజయవాడ సమీపంలోని కొండపావులూరు వద్ద జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... దేశంలో ఏ మూల సమస్య ఉన్నా పరిష్కారానికి పట్టుదలతో కష్టపడే అమిత్ షా శాంతిభద్రతల పరిరక్షణలో వినూత్నంగా ఆలోచిస్తుంటారని అన్నారు. సమస్యలపై లోతుగా అధ్యయనం చేసే అమిత్ షా నేతృత్వంలో దేశ నలుమూలలా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కొనియాడారు. ఆయన పనితీరు చూసి అప్పుడప్పుడు తాను అసూయ పడుతుంటానని నవ్వుతూ వ్యాఖ్యానించారు. సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో వినూత్నంగా ఆలోచించాలంటూ అమిత్ షా చేసిన సూచన తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల సాయంతో కేంద్రం ప్రాణం పోసిందని, ఆంధ్రుల చిరకాల వాంఛ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు. అలాగే గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.