Share News

Pawan Comments on Rajinikanth: రజనీ సినీ ప్రయాణం.. పవన్ కల్యాణ్ రియాక్షన్

ABN , Publish Date - Aug 16 , 2025 | 06:39 PM

నటుడిగా రజనీకాంత్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతినాయక పాత్ర పోషించినా.. కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు.

Pawan Comments on Rajinikanth: రజనీ సినీ ప్రయాణం.. పవన్ కల్యాణ్ రియాక్షన్
AP Dy CM pawan kalyan

అమరావతి, ఆగస్టు 16: సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ సందర్భంగా ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తరాలు మారుతున్నా రజనీకాంత్ అంటే.. సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదని చెప్పారు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజనీకాంత్ అని కొనియాడారు. నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారని ప్రశంసించారు.


వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజనీ’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మార్మోగుతుందో పలుమార్లు తాను చెన్నైలో చూశానని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతినాయక పాత్ర పోషించినా.. కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు.


రజనీ నడకలో.. సంభాషణలు పలకడంలో.. హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారని పేర్కొన్నారు. రజనీకాంత్ స్టైల్స్‌కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారన్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజనీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలు, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం.. ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియజేస్తుందని తెలిపారు.


నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని తాను ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు పవన్. రజనీకాంత్‌కి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 08:15 PM