Share News

Super six super hit: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:00 PM

2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Super six super hit: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అనంతపురం, సెప్టెంబర్ 10: 2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పేందు తాము అనంతపురానికి వచ్చామన్నారు.


సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని.. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అని అభివర్ణించారు. 57 శాతం మంది ప్రజలు ఓట్లేశారని.. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని.. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.


గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందన్నారు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం దాదాపు 93 పథకాలను నిలిపి వేసిందని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు.


సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారన్నారు. పెన్షన్ల, సూపర్ సిక్స్‌పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా అంటూ ప్రజలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటే హేళన చేశారన్నారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యమని పేర్కొన్నారన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు... దీపం వెలగదన్నారు... ఫ్రీ బస్సు కదలదన్నారంటూ గత వైసీపీలోని పెద్దలు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని.. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని సీఎం చంద్రబాబు వివరించారు.


యువ కిషోరాలను ఆదరిస్తామన్నారు. యువత అండగా ఉంటే కొండనైనా ఢీకొంటానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్‌లో చెప్పామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశామని.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా టీచర్ల రిక్రూట్‌మెంట్లు చేపట్టామని వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే.... మనం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఇదీ మన గుడ్ విల్, ఇదీ మన బ్రాండ్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత భవితకు భరోసా ఇచ్చాం కాబట్టే..‘యువగళం’ సూపర్ హిట్ అయిందన్నారు.


పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 5.60 కోట్ల భోజనాలతో ప్రజల కడుపు నింపామన్నారు. ఇంత కంటే ఆనందం ఏముందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పేదల పొట్ట కొట్టి.. అన్న క్యాంటీన్లను మూసేసిందని విమర్శించారు. ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో చెప్పాం... ఎన్ని కష్టాలున్నా చేస్తామని స్పష్టం చేశారు. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. మనకు అన్నం పెట్టేది అన్నదాత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తీసుకు వచ్చామని వివరించారు. కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నారు. తొలి విడతగా ఇప్పటికే రూ.7 వేలు ఇచ్చామని చెప్పారు. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశామన్నారు. నీళ్లిచ్చాం.. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం.. మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశామని వివరించారు.


ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా తాను చూసుకుంటానన్నారు. ఎంత యూరియా కావాలో అంతే వాడండంటూ రైతులకు సూచించారు. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చిందని చెప్పారు. ఆర్ధిక కష్టాలున్నా.. అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్ చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చామని గుర్తు చేశారు. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ప్రతీ ఏటా మూడు సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1,704 కోట్లు ఖర్చు చేసి.. 2.45 కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని తెలిపారు. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే.. దీపం పథకం సూపర్ హిట్ అయిందన్నారు.


ఈ కూటమి ప్రభుత్వం.. అందరి ప్రభుత్వం.. అన్ని వర్గాల ప్రభుత్వమన్నారు. అందరి జీవితాలు మార్చే ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దసరాకు కానుక ఇస్తున్నారని.. జీఎస్టీ సంస్కరణలు తీసుకు వచ్చారని తెలిపారు. ధరలను తగ్గిస్తున్నారని చెప్పారు. పన్నులను తగ్గించడం వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందించాలన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చామని చెప్పారు. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.


మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు వైఎస్ జగన్ అని.. అయితే తానేదో పొడి చేశానని మాట్లాడుతున్నాడంటూ వ్యంగ్యంగా అన్నారు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ అయిపోదన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం టీడీపీనే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 17 కాలేజీలు ఉంటే.. ఒక్క కాలేజీ మాత్రమే పూర్తి అయిందని చెప్పారు. ఫౌండేషన్ వేయడం.. రిబ్బన్ కట్ చేయడంతో తానేదో చేశానని వైఎస్ జగన్ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రండి.. మెడికల్ కాలేజీలపై చర్చిద్దామంటూ వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పూర్వ జన్మ సుకృతం.. అందుకే..

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 04:53 PM