Hawala Money Robbery: ఏకంగా హవాలా డబ్బునే ఎత్తుకెళ్లిన దుండగులు.. ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:23 PM
శ్రీసత్యసాయి జిల్లాలో జిల్లాలో జరిగిన రాబరీ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు వ్యక్తులు సూరత్ నుంచి బెంగుళూరుకు ఇన్నోవా కారులో తరలిస్తున్న హవాలా డబ్బును.. కొందరు దుండుగులు అడ్డుకుని కాజేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, డిసెంబర్ 8: సూరత్ నుంచి బెంగుళూరు తరలిస్తున్న హవాలా డబ్బునే ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరత్ నుంచి ఇద్దరు వ్యక్తులు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలను బెంగళూరుకు తరలిస్తున్నారు. అయితే హవాలా డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారును దుండగులు అడ్డగించారు. డబ్బును తరలిస్తున్న కారును.. మరో నాలుగు కార్లతో వెంబడించిన దుండగులు.. పెనుకొండ దగ్గర కారును అడ్డగించారు. ఆపై కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు.
అనంతరం ఓ చోట కారు ఆపి మూడు కోట్ల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే కారు సీటు కింద ప్రత్యేక అరలలో ఉన్న కోటి 20 లక్షల రూపాయలను తీసుకెళ్లటం కుదరక అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. బెంగళూరు జాతీయ రహదారిపై హవాలా డబ్బు తరలిస్తున్న కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు వెనుక వస్తున్న కారు డాష్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన కారు యజమాని ఈ విషయాన్ని పెనుకొండ దగ్గర చెక్‌పోస్ట్‌లో ఓసీఐకు తెలియజేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో గాలిస్తుండగా... సూరత్ నుంచి డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారు పోలీసుల కంటబడింది. వెంటనే వారిని పట్టుకుని నిలదీశారు. అసలు విషయాన్ని సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులు.. పోలీసులకు తెలిపారు.
తమను నాలుగు కార్లలో వచ్చిన కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి... మూడు కోట్లు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. అయితే కారు సీటు కింద హవాలా డబ్బు తరలించేందుకు ప్రత్యేక అరలు ఏర్పాట్లు చేసుకున్న దృశ్యాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆపై ప్రత్యేక అరలో దాచిన కోటి 20 లక్షల రూపాయలను పెనుకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడు కోట్లతో నాలుగు కార్లలో పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vande Mataram 150 Years: జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్థించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ
Vande Mataraam Debate: చర్చ ఏదైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు... మోదీకి గౌరవ్ గొగోయ్ కౌంటర్