Fake Cement Racket: ఫేమస్ బ్రాండ్స్ పేరుతో కల్తీ సిమెంట్ సరఫరా..
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:43 AM
ప్రముఖ సిమెంట్ కంపెనీల పేరుతో నకిలీ సిమెంట్‌ను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లాలో నకిలీ సిమెంట్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు.
శ్రీ సత్య సాయి జిల్లా, డిసెంబర్ 10: జిల్లాలో నకిలీ సిమెంట్ పరిశ్రమ బాగోతం బట్టబయలు అయ్యింది. ప్రముఖ సిమెంట్ పరిశ్రమల పేరుతో నకిలీ సిమెంట్ బ్యాగ్‌లు తయారు చేసి సిమెంట్‌ను సరఫరా చేస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో నకిలీ సిమెంట్ పరిశ్రమ బాగోతం బయటపడింది. అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, భారతి సిమెంట్స్ బ్రాండ్స్ పేరుతో ప్లయాష్‌ను కల్తీ చేసి నకిలీ సిమెంట్ బ్యాగ్‌లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి లేపాక్షి సిమెంట్ అనుమతులతో లైసెన్స్ తీసుకున్నాడు. మారుమూల ప్రాంతమైన గోరంట్ల మండలం గుత్తివారి పల్లి కేంద్రంగా నకిలీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి యదేచ్ఛగా నకిలీ సిమెంట్‌ను సరఫరా చేస్తున్నాడు. అయితే పక్కా సమాచారంతో లేపాక్షి సిమెంట్ డంపింగ్ గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు, జీఎస్టీ , రెవిన్యూ, పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ బ్రాండ్స్ పేరుతో కల్తీ సిమెంట్‌ను బెంగళూరుకు మహేష్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
విజిలెన్స్ దాడులలో రవాణాకు సిద్ధంగా ఉన్న మినీ లారీ, 335 సిమెంటు బస్తాలు, 88 అల్ట్రాటెక్ పేరుతో గల ఖాళీ సంచులను అధికారులు సీజ్ చేశారు. నకిలీ సిమెంట్ వ్యవహారంపై గోరంట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నకిలీ సిమెంట్ పరిశ్రమ యజమాని మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం
సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్
Read Latest AP News And Telugu News