Share News

Ananthapuram News: వైసీపీ ఉన్మాదం.. అర్ధరాత్రి వరకు రప్పా.. రప్పా..

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:05 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.

Ananthapuram News: వైసీపీ ఉన్మాదం.. అర్ధరాత్రి వరకు రప్పా.. రప్పా..

- జగన్‌ బర్త్‌డేలో రెచ్చిపోయిన శ్రేణులు

- పల్లెల్లో రోడ్డెక్కిన నాయకులు

- ఖాకీ తీరుపై టీడీపీ అసహనం

హిందూపురం(అనంతపురం): వైసీపీ(YCP) హయాంలో ప్రజాస్వామ్య బద్దంగా పగటిపూట అనుమతులతో కార్యక్రమం జరుపుకుంటామని వేడుకున్నా పోలీసులు అడ్డుచెప్పారు. 30 పోలీసు యాక్ట్‌ పేరుతో 2019నుంచి 2024వరకు టీడీపీ, జనసేన నాయకులకు చుక్కలు చూపించారు. ఆఖరుకు ఎన్టీఆర్‌ జయంతి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకూ జంకారు. దీంతో పార్టీ కార్యాలయం వద్దే కేక్‌ కట్‌ చేసుకునేవారు. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి జగన్‌ జన్మదిన వేడుకలను ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు రోడ్లపైనే ఆ పార్టీ నాయకులు జరుపుకున్నారు. టపాసులు పేల్చుతూ.. ద్విచక్రవాహనాల్లో ర్యాలీ నిర్వహించినా పట్టించుకున్న పోలీసులు లేరంటూ టీడీపీ నాయకులు వాపోతున్నారు.


టపాసులు పేల్చి..

ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హిందూపురం నియోజకవర్గంలోని పల్లెల్లో భారీఎత్తున టపాసులు పేల్చి, జగన్‌ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డి హాజరయ్యారు. టీడీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా 2029లో రాష్ట్రంలో వైసీపీ మొదటగా గెలిచేది హిందూపురమేననీ, అప్పుడు కూటమి నాయకులకు 201 చూపిస్తామంటూ మాట్లాడారు. గతంలో కూడా ఈయన పలుసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ కారణంగా జిల్లాలో ఎక్కడాలేనివిధంగా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు వైసీపీ నాయకులకు కొంతమంది టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వాపోతున్నారు. ఆ కారణంతోనే అర్ధరాత్రి దాటేవరకు అనుమతులు లేకున్నా టపాసులు పేల్చి, ర్యాలీ చేశారని విమర్శిస్తున్నారు.


చోద్యం చూసిన ఖాకీలు

వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు ఏ కార్యక్రమం చేయాలన్నా పోలీసులు అడ్డుకునేవారు. ఇళ్లలోనే బందించేవారు. అలాంటిది హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అనుమతులు లేకపోయినా ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, అర్ధరాత్రి రప్పా.. రప్పా.. అంటూ కేకలు వేసినా పోలీసులు మిన్నకుండిపోతున్నారు. దీంతో పోలీసుల తీరుపై కూటమి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.


pandu3.jpg

రెచ్చిపోయిన శ్రేణులు

జగన్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం పట్టణ పరిధిలోని మోతుకపల్లిలో ఆ పార్టీ నాయకులు రోడ్డుపైనే కేక్‌ కట్‌ చేసి, టపాసులు పేల్చి ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. ఈ సందర్బంగా రెండువర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. హిందూపురం మండలంలోని రెండు, మూడు గ్రామాలతోపాటు చిలమత్తూరు మండలంలోని పలు పల్లెల్లో కూటమి నాయకులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. కొన్ని పల్లెల్లో టీడీపీ, జనసేన పార్టీల నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి టపాసులు పేల్చి.. ఈలలు, కేకలు వేశారు. రోడ్లపైనే కేక్‌ కట్‌చేసి రాకపోకలకు ఇబ్బంది కలిగించారు. చాలా పల్లెల్లో రహదారుల మధ్యలో కేక్‌ కట్‌చేయడం వల్ల ఇబ్బందులకు గురిచేశారని సామాన్యులు వాపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 12:05 PM