Share News

Journalist and Analyst Krishnam Raju: అది వేశ్యల రాజధాని

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:05 AM

రాజధాని అమరావతిపై జగన్‌ అండ్‌ బ్యాచ్‌ మరోసారి విషం చిమ్మింది. ఇక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరితెగించింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత చానల్‌లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు శనివారం ఉదయం లైవ్‌ డిబేట్‌లో నోరుపారేసుకున్నారు.

Journalist and Analyst Krishnam Raju: అది వేశ్యల రాజధాని

  • అమరావతిపై మరోసారి జగన్‌ బ్యాచ్‌ విషం

  • సాక్షి డిబేట్‌లో మహిళలకు ఘోర అవమానం

  • భగ్గుమన్న అమరావతి ప్రాంత మహిళలు

  • రోత మీడియాలో వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

  • జర్నలిస్టులు కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజుతో పాటు

  • భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

  • ఆ చానల్‌ మూయించే వరకూ ఉద్యమిస్తామని వెల్లడి

  • 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

  • మహిళల నిరసనకు రైతుల మద్దతు

  • రాజధానిలో దిష్టి బొమ్మల దహనం

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌: రాజధాని అమరావతిపై జగన్‌ అండ్‌ బ్యాచ్‌ మరోసారి విషం చిమ్మింది. ఇక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరితెగించింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత చానల్‌లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు శనివారం ఉదయం లైవ్‌ డిబేట్‌లో నోరుపారేసుకున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్‌) నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న జర్నలిస్టు, విశ్లేషకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అంటున్నారు, కానీ ఇది సెక్స్‌ వర్కర్లకు నిలయం. ఇక్కడే ఎక్కువ మంది వేశ్యలు ఉన్నారు. వారికోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజధాని మహిళలు భగ్గుమన్నారు. రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని అల్టిమేటమ్‌ జారీ చేశారు. కృష్ణంరాజుకు మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తప్పవన్నారు. డిబేట్‌ నిర్వహించిన కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. సాటి మహిళలను అగౌరవపరుస్తుంటే ఖండించకుండా ఉన్నందుకు భారతిరెడ్డి కూడా బాధ్యురాలేనని, ఆమె కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐదేళ్లు అమరావతి ఉద్యమం చేసి వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చేటట్టు చేసి సత్తా చాటామని, ఇప్పుడు సాక్షి చానల్‌ మూసే వరకు మరో ఉద్యమం చేపడతామని మహిళలు ప్రకటించారు. ఉద్యమం తమకు కొత్తకాదని, కేసులు కూడా కొత్త కాదన్నారు. రాజధాని ప్రాంత మహిళలను తీవ్రంగా కించపరచడంలో భాగస్వాములైన ఆ ముగ్గురు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని రైతు జేఏసీ హెచ్చరించింది. ఈ సందర్భంగా మహిళలు కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజు ఫొటోలను గోడకు అతికించి చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కేఎ్‌సఆర్‌, జర్నలిస్ట్‌ కృష్ణంరాజును 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి రాజధాని ఐదు కోట్ల ఆంధ్రులదని, పూర్వకాలం నుంచి ఈ ప్రాంతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని మహిళలు చెప్పారు. కృష్ణంరాజును, కేఎ్‌సఆర్‌ను ఉరితీయాలని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి చానల్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా పెదపాడు పోలీస్‌ స్టేషన్‌లో కూటమి శ్రేణులు ఫిర్యాదు చేశాయి.


కృష్ణంరాజు ఇంటిని ముట్టడించిన రైతులు

అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు ఇంటిని అమరావతి రైతులు శనివారం ముట్టడించారు. విజయవాడ అయోధ్యనగర్‌లోని ఆయన ఇంటికి రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి మహిళలకు కృష్ణంరాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు వస్తున్నారన్న సమాచారంతో కృష్ణంరాజు ఇంటి నుంచి పారిపోయారు. ఆయన ఇంటి ముందు రైతులు కొద్దిసేపు నినాదాలు చేసి వెనుదిరిగారు.

కృష్ణంరాజు, కేఎస్ఆర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బాలకోటయ్య

రాజధాని అమరావతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజులను వెంటనే అరెస్ట్‌ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్‌ చేశారు. ప్రజా రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 24 గంటల్లో వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బాలకోటయ్య డిమాండ్‌ చేశారు.

ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం:సాక్షి యాజమాన్యం

సాక్షి టీవీ వేదికగా జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సాక్షిపై సోషల్‌ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన తప్పునకు క్షమాపణలు కోరాల్సిన సాక్షి యాజమాన్యం, వైసీపీ రాష్ట్ర నాయకత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. ఇందులో సాక్షి యాజమాన్యానికిగానీ, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి గానీ సంబంధం లేదంటూ శనివారం ప్రకటించి చేతులు దులుపుకొన్నాయి.


రాజధానిలో ఆగ్రహజ్వాలలు

తుళ్లూరులో శనివారం సాయంత్రం రాజధాని మహిళలు, రైతులు, రైతు కూలీలు లైబ్రరీ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజు దిష్టిబొమ్మలను దహనం చేశారు. సాక్షి పత్రికను అబద్ధాల వైసీపీ కరపత్రిక అంటూ రోడ్డుమీద తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక, చానెల్‌ నడుపుతున్న భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గవర్నర్‌ను, జాతీయ మహిళా కమిషన్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని రైతు జేఏసీ తెలిపింది. జర్నలిస్ట్‌ ముసుగులో జగన్‌రెడ్డి చెంచాగా వ్యవహరించే కృష్ణంరాజును వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఇక మహిళలకు రక్షణగా సెంటర్‌లో రైతులు మావవహారంగా ఏర్పడ్డారు. కృష్ణంరాజు, కేఎ్‌సఆర్‌ చిత్రపటాలను చెప్పులతో కొట్టి, కాళ్ల కింద వేసి తొక్కారు. అటుగా వెళ్తున్న బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు కూడా దిగివచ్చి మహిళలకు సంఘీభావం తెలిపారు.

Updated Date - Jun 08 , 2025 | 03:17 AM