Share News

AP Govt : 7 నెలలు.. 6 లక్షల కోట్లు !

ABN , Publish Date - Jan 27 , 2025 | 02:54 AM

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచస్థాయి దిగ్గజ వ్యాపార వేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు పలుమార్లు...

AP Govt : 7 నెలలు.. 6 లక్షల  కోట్లు !

  • రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ

  • 4 లక్షల ఉద్యోగాలు కూడా

  • దావోస్‌ పర్యటనకు ముందే క్యూకట్టిన పెట్టుబడిదారులు

  • ప్రపంచ ఆర్థిక సదస్సులో మార్మోగిన ‘బ్రాండ్‌ ఏపీ’

  • మున్ముందు మరిన్ని రాక..

  • పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలి: నిపుణులు

ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థల రాక ఒకవైపు, జగన్‌ పాలనలో భయపడి వెళ్లిపోయిన వారి రాక మరోవైపు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల్లో ఏర్పడిన నమ్మకం.. ఏడు మాసాల స్వల్ప కాలంలోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చింది. ఇటీవల ముగిసిన దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముందే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటూ అనేక మంది ముందుకువచ్చారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గడిచిన ఏడు మాసాల కాలంలో రూ.6,33,726 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచస్థాయి దిగ్గజ వ్యాపార వేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు పలుమార్లు భేటీ అయి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూల వాతావరణం సహా నైపుణ్యంతో కూడిన యువత విషయాలను సమగ్రంగా వివరించారు. దీంతో ఏడు నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా ‘విజన్‌-2047’ సహా ‘బ్రాండ్‌ ఏపీ’ నినాదం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని తిరిగి పట్టాలెక్కించడంతో వారి ఆశలు చిగురించాయి. ఫలితంగా గతంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపి.. తర్వాత జగన్‌ పాలనతో విసుగెత్తి వెళ్లిపోయిన వారు కూడా నిదానంగా రాష్ట్రానికి రావడం ప్రారంభించారు. దీంతో పెట్టుబడులకు ఊపొచ్చిందని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి. దీనికితోడు సుదీర్ఘ తీరప్రాంతం సహా రాష్ట్రంలోని సహజ వనరులు వంటివి పారిశ్రామికవేత్తలను మరింత ఆకర్షిస్తున్నాయి.


కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు నెలల్లోనే ఏకంగా రూ.6,33,726 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. వీటి రాకతో 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు ‘బ్రాండ్‌ ఏపీ’ నినాదాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రయత్నం విజయవంతమైందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

ఎన్టీపీసీ భారీ పెట్టుబడి

కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ప్రైవేటురంగంలోని పారిశ్రామికవేత్తలతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వీటిలో ఎన్టీపీసీ హరిత ఇంధన రంగంలో ఏకంగా రూ.1,85,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 57,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సంస్థ కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా ఇటీవల ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు రావడం వల్ల స్థిరమైన ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ), ఏపీ జెన్కో.. సంయుక్త భాగస్వామ్యంతో పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టులు స్థాపించేందుకు ఒప్పందం చేసుకుంది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 7000 మందికి ఉద్యోగాలు కల్పించే ఈ కేంద్రాన్ని కర్నూలు జిల్లాలో స్థాపించనున్నారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్స్‌ సంస్థ అనకాపల్లి జిల్లాలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు సిద్ధమైంది.


అనుబంధ శాఖలు కదలాలి!

2019-24 మధ్య పారిశ్రామిక వ్యతిరేక ధోరణులకు అలవాటుపడ్డ నాటి జగన్‌ ప్రభుత్వ తీరుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం వ్యవహరించింది. కానీ, ఇప్పుడు పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలని కూటమి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అనుబంధ శాఖలు కూడా స్ఫూర్తిమంతంగా పనిచేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 2014-19 మధ్య నాటి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులుగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారులు జేఎ్‌సవీ ప్రసాద్‌, ఎస్‌ఎస్‌ రావత్‌, సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, కార్తికేయ మిశ్రాలు పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించారు. పారిశ్రామిక వేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో సీఎం చంద్రబాబు దావోస్‌ పెట్టుబడుల సదస్సుకు వెళ్లక ముందే వీరంతా అక్కడకు చేరుకుని సన్నాహక ఏర్పాట్లు చేసేవారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముందుగానే క్రియాశీల భేటీలను నిర్వహించేవారు. దాని ఫలితంగానే అశోక్‌ లేలాండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హీరో ఫాక్స్‌కాన్‌, హెచ్‌సీఎల్‌ ఎలకా్ట్రనిక్స్‌ తయారీ లాంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి.

Untitled-4 copy.jpg


తిరిగొచ్చిన గతం

2019-24 మధ్య జగన్‌ పాలనాకాలంలో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అదానీ, రిలయన్స్‌ వంటి సంస్థలు జగన్‌ ప్రభుత్వ కాలంలో ఒప్పందాలు చేసుకున్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ, కూటమి సర్కారు పగ్గాలు చేపట్టాక రాష్ట్రానికి పునర్‌వైభవం తిరిగి వచ్చిందని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు విజన్‌, ఆయన పనితీరుపై నమ్మకంతో పారిశ్రామిక సానుకూల వాతావరణం నెలకొందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పారిశ్రామిక అనుబంధ శాఖలు వాటిని అందిపుచ్చుకునేలా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. ‘ఏపీ బ్రాండ్‌’ ప్రమోషన్‌లోనూ అవి వెనుకబడుతున్నాయన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తక్షణమే ప్రోత్సాహక విధానంపై దృష్టిపెట్టి పెట్టుబడులపై కసరత్తు చేసేలా చూడాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. అనుబంధ శాఖల్లోనూ రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 02:58 AM