Viral Video: భారీ వర్షాలతో నీట మునిగిన కోల్‌కతా విమానాశ్రయం

ABN, Publish Date - Aug 03 , 2024 | 06:25 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది.

విమానాశ్రయ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానాశ్రయం రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. కోల్‌కతాతోపాటు పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్, బరాక్‌పూర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీనికితోడు తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అల్పపీడనం ప్రస్తుతం బిహార్, ఉత్తరప్రదేశ్ వైపు మళ్లుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉంది. విమానాశ్రయంలో నిలిచిన నీటిని తోడివేయడానికి అధికారులు మోటార్లు ఉపయోగిస్తున్నారు.


ఐఎండీ హెచ్చరికలు..

కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని గంగా నది తీర జిల్లాల్లో 11 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పురూలియా, ముర్షిదాబాద్, మాల్దా, కూచ్‌బెహార్, జల్‌పైగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలీపుర్‌దూర్ జిల్లాకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. అలీపుర్‌దూర్‌లో 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

Updated at - Aug 03 , 2024 | 06:53 PM