Share News

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు ఎవరికి?

ABN , Publish Date - Jun 28 , 2024 | 02:59 AM

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. రేవంత్‌రెడ్డి ఓ వైపు సీఎంగా.. మరోవైపు పీసీసీ చీఫ్‌గా జోడు పదవులు నిర్వహిస్తుండగా.. పార్టీ పగ్గాలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు.

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు ఎవరికి?

  • పరిశీలనలో పలువురు నేతల పేర్లు

  • బీసీ కోటాలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

  • ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్‌

  • ఎస్సీ కోటానూ పరిగణలోకి

  • తీసుకుంటే భట్టి విక్రమార్క, సంపత్‌

  • సీఎం సహా.. ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. రేవంత్‌రెడ్డి ఓ వైపు సీఎంగా.. మరోవైపు పీసీసీ చీఫ్‌గా జోడు పదవులు నిర్వహిస్తుండగా.. పార్టీ పగ్గాలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. ఓ దశలో రేవంత్‌రెడ్డి కూడా తాను ప్రభుత్వ బాధ్యతలకే పరిమితం కానున్నట్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. వచ్చేనెల ఏడో తేదీతో రేవంత్‌రెడ్డి పీసీసీ బాధ్యతలను స్వీకరించి మూడేళ్లు పూర్తవుతాయి. దీంతో కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. సీఎం రేవంత్‌ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో పీసీసీపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు.. సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహా పలువురు సీనియర్ల అభిప్రాయాలను ఏఐసీసీ సేకరిస్తోంది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ కూడా ఈ అంశంపై సోనియాగాంధీని కలిశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి,, దీపాదాస్‌ మున్షీతో భేటీ అయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ భేటీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా ఉన్నారు. సీనియర్‌ నేతలతో పాటు ఆశావహులంతా ఢిల్లీలో మకాం వేయటంతో కాంగ్రెస్‌ పార్టీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఏసామాజికవర్గం వైపు మొగ్గు చూపుతుందనేదే ఇప్పుడు కీలకంగా మారింది.


సామాజిక సమీకరణాలే కీలకం!

రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావటంతో.. పీసీసీ అధ్యక్ష పదవిని ఆ వర్గానికి ఇచ్చే అవకాశం కనిపించడంలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారిలో ఒకరికి పీసీసీ చీఫ్‌ పదవిని అప్పగిస్తారనే అంశంపై స్పష్టత ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బలహీనవర్గాల్లో.. బీసీలకిస్తారా? ఎస్సీలకిస్తారా? ఎస్టీలకిస్తారా? అనేది ఇంకా తేలాల్సి ఉందని వివరిస్తున్నాయి. సీనియర్లంతా పీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తటస్థంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


బీసీ కోటాలో మహేశ్‌ ఆశలు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. రేసులో ముందు వరుసలో ఉన్నారు. పార్టీలో సీనియర్‌ నేతగా మహేశ్‌కు గుర్తింపు ఉంది. ఢిల్లీ పెద్దలతో కూడా సత్సంబంధాలున్నాయి. పీసీసీ వ్యవస్థీకృత వ్యవహారాలనూ మహేశ్‌ పర్యవేక్షించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ను ఆశించినప్పటికీ అవకాశం రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ పదవులకు రెడ్డి-బీసీ కాంబినేషన్‌ 1992 నుంచి కొనసాగుతోందని, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రెడ్డి వర్గానికి చెందిన నేత కావడంతో.. ఇప్పుడు మహేశ్‌ పీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీ కేటగిరీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్లు కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ గౌడ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం..! రాష్ట్రంలో పుంజుకుంటోన్న బీజేపీ బీసీ నాయకత్వం వైపే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా పీసీసీ పగ్గాలను అదే వర్గానికి ఇస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


అనూహ్యంగా తెరపైకి బలరాంనాయక్‌

పీసీసీ చీఫ్‌ రేసులో మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. బలరాం నాయక్‌ ఎస్టీ కేటగిరీలో మెజారిటీ ఉపకులమైన ‘లంబాడా’ వర్గానికి చెందిన వారు. 2009-14 మధ్యకాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అప్పట్లో ఎవరూ ఊహించని రీతిలో సోనియాగాంధీ ప్రతిపాదనతో బలరాం నాయక్‌కు కేంద్ర క్యాబినెట్‌లో స్థానం దక్కింది. వివాద రహితుడు, అధిష్ఠానానికి విధేయంగా ఉంటారనే పేరు ఆయనకు ఉంది.


భట్టి, సంపత్‌ పోటీ

పీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజికవర్గాలకు ఇవ్వాల్సి వస్తే.. ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాల కేటగిరీలో ముందువరుసలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తే.. ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారని, ఇప్పుడు పీసీసీ అఽధ్యక్ష పదవిని కూడా తనకే ఇవ్వాలనే ప్రతిపాదనను భట్టి అధిష్ఠానం ముందు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో కూడా పాటించవచ్చుకదా? అనే వాదనను భట్టి తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అయితే.. కాంగ్రె్‌సలో మాలలకు ప్రాధాన్యత పెరుగుతోందని.. పీసీసీ పగ్గాలను మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పీసీసీ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ టికెట్‌ను ఆశిస్తే.. మల్లు భట్టివిక్రమార్క సోదరుడు మల్లు రవికి దక్కడాన్ని ఆయన గుర్తుచేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jun 28 , 2024 | 02:59 AM