Share News

Phone Tapping: ట్యాపింగ్‌ మంటలు.. అగ్రనేతల కన్నెర్ర..!

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:13 AM

రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తుండడంతో బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారానికి నాటి ముఖ్యమంత్రిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,

Phone Tapping: ట్యాపింగ్‌ మంటలు.. అగ్రనేతల కన్నెర్ర..!
Phone Tapping Case

  • ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం’మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు

  • కేసీఆర్‌దే బాధ్యత.. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ధ్వజం

  • దీనిపై న్యాయవిచారణ జరిపించాల్సిందేనని డిమాండ్‌

  • మొదటి ముద్దాయి కేసీఆరే.. కేసు సీబీఐకి అప్పగించాలి

  • దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్లూ విన్నారు

  • హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డినీ ముద్దాయిలుగా చేర్చాలి

  • మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికీ ట్యాపింగే కారణం

  • హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారించాలి

  • ఈ నెల 19న.. విమానంలో హరీశ్‌, రేవంత్‌ చర్చలు

  • అందుకే చర్యలపై సర్కారు వెనకడుగు: రఘునందన్‌

  • నా ఫోనూ ట్యాప్‌ చేశారు.. కఠిన చర్యలు తీసుకోండి

  • డీజీపీకి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం ఫిర్యాదు’

హైదరాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తుండడంతో బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారానికి నాటి ముఖ్యమంత్రిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్‌ అధికారులతో అప్పటి సీఎం ఈ వ్యవహారాన్ని దుర్మార్గంగా నడిపించారంటూ.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల మాఫియాలూ రాజ్యమేలాయని దుయ్యబట్టారు. ట్యాపింగ్‌ వ్యవహారంతో అవినీతి అంశం కూడా ముడిపడి ఉందని.. దీనిపై న్యాయవిచారణ జరిపితేనే నాటి సీఎం, డీజీపీ, ఉన్నతాధికారుల జోక్యం ఎంతనే విషయం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్‌ హయాంలో తమ పార్టీ నాయకుల ఫోన్లను, ఆఫీస్‌ సిబ్బంది ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయని మండిపడ్డారు.

వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం కోసం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఇక.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చేర్చాలని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్‌ను కూడా ట్యాప్‌చేసి తన ప్రచార తీరుతెన్నులను తెలుసుకొని ఇబ్బందులకు గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. దానికి సంబంధించి రెండో ముద్దాయిగా మాజీ మంత్రి హరీశ్‌రావును, మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని డిమాండ్‌ చేశారు. వీరితోపాటు అప్పటి డీజీపీని కూడా ముద్దాయిగా చేర్చాలన్నారు. మంగళవారం సంగారెడ్డి సమీపంలోని కందిలో బీజేపీ జిల్లా కార్యాలయంలో రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఓటమికి ఫోన్‌ ట్యాపింగే కారణమన్నారు. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ ఫోన్‌ను కూడా ట్యాపింగ్‌ చేసి కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఇందులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాత్ర కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆయనను కూడా అరెస్ట్‌ చేసి విచారించాలని కోరారు. ‘‘ఐన్యూస్‌ చానల్‌ ఎవరిది? ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయట్లేదు? చానల్‌ను ఎందుకు సీజ్‌ చేయట్లేదు?’’ అని రఘునందన్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తరువాత హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో.. ఈ నెల 19న విమానంలో హరీశ్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య రెండు గంటలపాటు చర్చలు జరిగాయని రఘునందన్‌రావు అన్నారు. ఆ చర్చల నేపథ్యంలోనే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు పాస్‌పోర్ట్‌లను వెంటనే సీజ్‌ చేయాలని.. హరీశ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసుపై వెంటనే క్యాబినెట్‌ తీర్మానం చేసి సీబీఐకి అప్పగించాలన్నారు. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

కఠినచర్యలు తీసుకోవాలి..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తాను కూడా బాధితుడినేనని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. తనతోపాటు తన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఫోన్లనూ ట్యాప్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే వందల మంది బాధితులు ఉన్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఫోన్లు ట్యాప్‌ చేయడమే కాక.. వాటి ద్వారా ఎంతోమంది వ్యక్తిగత అంశాలను సేకరించి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తునకు రాష ్ట్రస్థాయిలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు.. బాధ్యులందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ రవిగుప్తాను ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం యెన్నం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాల్ని డీజీపీకి అందించానని చెప్పారు. బాధితులంతా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు కూడా.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించడం ద్వారా కల్వకుంట్ల కుటుంబం అతిపెద్ద నేరానికి పాల్పడిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే కేటార్‌ తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించుకుని.. చేయని పాపం లేదని విమర్శించారు. అధికార దాహంతో ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడిన కల్వకుంట్ల కుటుంబంపై ప్రజలు తిరగబడి.. ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. తన చెల్లి కవితలాగానే కేటీఆర్‌ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని దయాకర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 07:30 AM