Share News

TG: పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే..

ABN , Publish Date - May 26 , 2024 | 06:02 AM

ద్యా సంవత్సరం ప్రారంభమైందంటే స్కూల్‌ బ్యాగ్స్‌పై చర్చ పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల బరువు కంటే వారి పుస్తకాల బరువు ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చిన్నారులకు వెన్నెముక సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TG: పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే..

  • ప్రతి నెలా మూడో శనివారం అమలు

  • అన్ని తరగతులకు డిజిటల్‌ బోధన

  • 9 గంటలకే ప్రారంభం కానున్న బడులు

  • కొత్త విద్యా ఏడాదిలో 229 పనిదినాలు

  • ఈసారి 20 రోజుల ముందే క్యాలెండర్‌

  • ఏడో తరగతి గణితం బోధనపై స్పష్టత

  • పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌

    హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే స్కూల్‌ బ్యాగ్స్‌పై చర్చ పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల బరువు కంటే వారి పుస్తకాల బరువు ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చిన్నారులకు వెన్నెముక సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు చేయనుంది. నెలకో రోజు ‘నో బ్యాగ్‌ డే’గా ప్రకటించింది. ప్రతి నెలా మూడో శనివారం విద్యార్థులు పాఠశాలకు పుస్తకాలు లేకుండా రావాల్సి ఉంటుంది. ఆ రోజు విద్యార్థుల బోధనకు సంబంధించి ఎస్‌సీఈఆర్టీ ప్రత్యేక ప్రణాళిక ప్రకటించనుంది.


ఈ విధానం కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు దీనిని తప్పనిసరిగా పాటించాలి. కొత్త విద్యా సంవత్సరం వచ్చే నెల 12 నుంచి ప్రారంభమై 2025 ఏప్రిల్‌ 23న ముగుస్తుంది. దీనికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండరును పాఠశాల విద్యా శాఖ శనివారం విడుదల చేసింది. ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ), సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలతో పాటు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించే తేదీలు ప్రకటించింది. మార్చి 2025లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం సంవత్సరంలో 229 పనిదినాలు ఉన్నాయి. అన్ని తరగతులకు సాఫ్ట్‌నెట్‌ ద్వారా డిజిటల్‌ తరగతుల బోధన తప్పనిసరి చేశారు. ప్రతీ రోజు 20-25 నిమిషాల పాటు ఈ ప్రసారాలు ఉంటాయి. ప్రసారాలకు ముందు ఉపాధ్యాయులు 5 నిమిషాల పాటు ఆ రోజు తరగతికి సంబంధించి విద్యార్థులకు వివరించాలి. పాఠ్యాంశాలపై విద్యార్థులకు లోతైన అవగాహనకు ఈ విధానం దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. నైతిక విలువలు, లైఫ్‌ స్కిల్స్‌పై ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ రోజు ప్రార్థన సమయంలో 5 నిమిషాలు యోగా/ధ్యానం కోసం కేటాయించారు.


  • ఏడో తరగతి గణితంపై స్పష్టత

6, 7 తరగతులకు గణితం ఎవరు బోధించాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వివాదం నెలకొంది. మ్యాథ్స్‌ టీచర్‌, సైన్స్‌ టీచర్‌లో ఈ బాధ్యతను ఎవరు నిర్వర్తించాలన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో అనేక పాఠశాలల్లో విద్యార్థులు గణిత బోధనకు దూరమయ్యేవారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఈ అకడమిక్‌ క్యాలెండరులో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 6, 7 తరగతుల గణిత శాస్త్రాన్ని ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ బోధించాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీచేశారు.


  • 20 రోజుల ముందే క్యాలెండర్‌

అకడమిక్‌ క్యాలెండరును ప్రతీ ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ఒక రోజు ముందు ప్రకటిస్తుండగా ఈసారి 20 రోజుల ముందు ప్రకటించడంపై విద్యా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో విద్యా ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేసేందుకు సమయం లభిస్తుందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. 9 గంటలకే పాఠశాలలు

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వేళలు గతంలో ఉదయం 9.30 నుంచి ఉండగా దీనిని 9 గంటలకు మార్చారు. ప్రాథమిక పాఠశాలల (1-5 తరగతులు) ఉదయం 9 నుంచి 4, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 3.45 వరకు ఉంటాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి 4.15 వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు పనిచేస్తాయి. ఇవి రెండూ జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి 4 గంటల వరకు ఉంటాయి.

Updated Date - May 26 , 2024 | 06:02 AM