Share News

TS POLITICS: మీడియాకు రేవంత్ పాలనపై ఆ విషయాలు కనిపించట్లేదా..?: ప్రశాంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:09 PM

అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.14వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ఆరోపించారు.

TS POLITICS: మీడియాకు రేవంత్ పాలనపై ఆ విషయాలు కనిపించట్లేదా..?: ప్రశాంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా: అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.14వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ఆరోపించారు. శుక్రవారం నాడు వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్‌లో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారని.. ఆ తర్వాత.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ప్రజా దర్బార్‌లో పాల్గొనలేదని అన్నారు. ఇప్పుడు అధికారులు మాత్రమే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను కలవలేదని ప్రచారం చేసిన మీడియా.. ఇప్పుడు 50 రోజుల్లో జరిగిన ప్రజా దర్బార్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ప్రజలను కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు చేశారని ప్రచారం చేసిన మీడియా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కనిపించడం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.15వేల రైతు బంధు ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పైసలను కూడా ఇప్పుడు ఇవ్వట్లేదని.. నేడు రైతులు అప్పులు చేసి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తప్పించుకుంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.


కాంగ్రెస్ మోసపూరిత హామీలపై యూటర్న్..

రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీలను వీడియో ద్వారా చూపిస్తూ హామీలపై ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే.. తెలంగాణలో పథకాలు అమలవుతాయని ఆ పార్టీ నేతలు అంటున్నారని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ రావడం కష్టమని.. ఇప్పుడు మూడు రాష్ట్రాల్లోనే హస్తం పార్టీ అధికారంలో ఉందని ఇది సాధ్యం కాదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే... తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టి.. 50 రోజుల్లోనే యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని.. బీఆర్ఎస్‌లో గ్రూప్‌లు లేకుండా కష్టపడి పని చేసి ఎంపీగా రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్‌పై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు వారు వంత పాడితే మీ చిట్టా రాసిపెట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని.. లోకల్ బాడీ ఎన్నికల్లోనే చిత్తు చిత్తుగా ఓడిస్తారని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

వారిపై.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిద్దాం

బీఆర్ఎస్‌కు పనిచేసిన ప్రతి కార్యకర్త మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పనిచేశారో తమకు తెలుసునని.. మనమంతా కుటుంబ సభ్యులం ఏ ఒక్కరినీ అంత త్వరగా పోగొట్టుకోమని అన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో వారికి నచ్చజెప్పి అప్పుడు వినకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిద్దామని అన్నారు. ఉద్దండులైన టీడీపీ అధినేత చంద్రబాబు... దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి వారినే.. మాజీ సీఎం కేసీఆర్ ఎదుర్కొని ధైర్యంగా నిలిచారని చెప్పారు. కేసీఆర్ లేకపోతే.. నేడు రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యేవారా అని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి పెట్టడంతో 24గంటలు కష్టపడి పని చేయడంతో పార్టీని అభివృద్ధి చేసుకోలేకపోయామని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో.. పార్టీ శ్రేణులకు సరైన న్యాయం చేయలేకపోయమని... అదే ఇప్పుడు నష్టం చేసిందన్నారు. బీఆర్ఎస్‌పై 1.8శాతం ఓట్లు ఎక్కువ సాధించిన వారు ధర్మ యుద్ధం చేసి గెలవలేదని.... అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. ప్రగతి భవన్‌పై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని.. తాను మొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిస్తే.. 150గదులు బాగున్నాయని నవ్వుతూ వెల్లిపోయారని చెప్పారు. పార్లమెంట్‌లో నీటి ప్రాజెక్టుల అంశంలో మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఉండాల్సిందేనని.. తెలంగాణ సమస్యలపై కాంగ్రెస్, బీజేపీలు కేంద్రాన్ని ప్రశ్నించవని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 04:09 PM