Share News

CM Revanth : కేసీఆర్‌కు నో ఎంట్రీ .. ఇక నీ జీవితంలో పదవిని కళ్లతో చూడలేవ్‌.

ABN , Publish Date - May 01 , 2024 | 03:29 AM

కేసీఆర్‌ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని.. ఆయనఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్‌ గోడ మీద వాలినా కాల్చివేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

CM Revanth : కేసీఆర్‌కు నో ఎంట్రీ .. ఇక నీ జీవితంలో పదవిని కళ్లతో చూడలేవ్‌.

ఆయన్ను ఇండియా కూటమిలో కలవనివ్వం

  • ఆ ఇంటిపైవాలిన కాకి కాంగ్రెస్‌ గోడపై వాలితే కాల్చి పడేస్తాం

  • పన్నెండు సీట్లు వస్తే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందా?

  • కేసీఆర్‌.. ఇక నీ జీవితంలో పదవిని కళ్లతో చూడలేవ్‌

  • ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే

  • గుజరాత్‌ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు

  • బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు కేసీఆర్‌ తిట్టే తిట్లే మోదీ తిట్టారు

  • జమ్మికుంట, రేగొండ, బాలాపూర్‌, ఎన్టీఆర్‌ నగర్‌ల్లో రేవంత్‌

కరీంనగర్‌, భూపాలపల్లి, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేసీఆర్‌ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని.. ఆయనఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్‌ గోడ మీద వాలినా కాల్చివేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రె్‌సను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయన ఖమ్మం సభలో.. కాంగ్రె్‌సకు ఈ ఎన్నికల్లో 40 సీట్లు రావని, బీజేపీకి 200 సీట్లలోపే వస్తాయని, రాష్ట్రంలో తమకు 12 సీట్లు ఇస్తే సంకీర్ణంలో చేరి నామాను కేంద్రమంత్రి చేస్తామని అన్నారని దుయ్యబట్టారు.


‘‘బీఆర్‌ఎ్‌సకు 12 సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో, భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జనజాతర సభల్లో, హైదరాబాద్‌లోని బాలాపూర్‌, ఎన్టీఆర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌షోల సందర్భంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్‌కు చేరే విధంగా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్లు సూరత్‌కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏం లేదని, ఇక్కడి (కరీంనగర్‌) ఎంపీ బండి సంజయ్‌ తెచ్చింది ఏం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను, 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలను అవమానపరిచే విధంగా మోదీ పార్లమెంట్‌లో మాట్లాడితే ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ ఏం మాట్లాడకుండ మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అప్పట్లో.. పేదోళ్ల బిడ్డ అని, గుండో, అరగుండో అని బండికి ప్రజలు ఓటేశారని.. నిజామాబాద్‌ గుండుగానీ, కరీంనగర్‌ అరగుండు గానీ తెలంగాణకు తెచ్చింది ఏమి లేదని విమర్శించారు. మోదీ జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని, ఐటీఐఆర్‌, కారిడార్‌ ఇవ్వలేదని, రాష్ట్రానికి ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన ప్రజలకు గాడిద గుడ్డు అన్ని రాసి ఉన్న ఓ వస్తువును చూపించారు.


కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, చెంబెడు నీళ్లు ఇచ్చి తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అయోధ్య రాముడి కల్యాణానికి 15 రోజుల ముందే ఊరూరా అక్షింతలు పంపిణీ చేశారని, కల్యాణం జరక్కముందే అక్షింతలు ఎక్కణ్నుంచి వచ్చాయని రేవంత్‌ ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా ముందస్తుగా అక్షింతలను పంచి శ్రీరాముడిని అవమానించారని మండిపడ్డారు.దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలని.. కానీ గుండు, అరగుండు బజార్లలో, బస్టాండ్లలో దేవుడి బొమ్మపెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్లు ఓట్లను అడుక్కుంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన రిజర్వేషన్లను..

అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించిందని రేవంత్‌ గుర్తు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దళితులు, గిరిజనులు, బీసీలపై సర్టికల్‌ స్ట్రైక్‌ చేసి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ఈ గడ్డపైకి వస్తున్న మోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన కోసం ఢిల్లీ పోలీసులు వస్తున్నారని.. పదేళ్లు కేసీఆర్‌ ఇదే విధంగా ఏసీబీ పోలీసులు, విజిలెన్స్‌తో తనను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపిస్తే చివరి ఏమైందని... నడుము విరిగి కేసీఆర్‌ మూలకుపడ్డారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కారు ఖరాబైందని, షెడ్డుకు పోయిన ఆ కారు మళ్లీ రాదని, తూకం వేసి అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌, చేవేళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ సీట్లలో బీజేపీని గెలిపించేలా.. ఖమ్మం, నల్లగొండ, మెదక్‌లో బీఆర్‌ఎ్‌సను గెలిపించేలా ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని, వేములవాడ రాజన్న సాక్షిగా చెబుతున్నానన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.


అమిత్‌ షాకు కేసీఆర్‌ ఆవహించినట్టు..

వరంగల్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్న రేవంత్‌.. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా జయశంకర్‌ పుట్టిన గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా కూడా మార్చలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే దానిని నెరవేర్చామని గుర్తుచేశారు. రిజర్వేషన్ల రద్దుకు కేంద్రం చేస్తున్న కుట్ర గురించి ప్రశ్నిస్తే అమిత్‌షాకు కేసీఆర్‌ ఆవహించినట్టు ఉందని.. అందుకే కేసీఆర్‌ తరహాలో తనపై తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించేందుకు, ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపి అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

గుజరాత్‌ పెత్తనమో, తెలంగాణ ప్రజల పౌరుషమో ఈ ఎన్నికలు తేల్చనున్నాయని అన్నారు. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఈ గడ్డకుందని, ఢిల్లీ పోలీసులనే కాదు.. సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకున్నా భయపడేదేలేదన్నారు. కడియం కావ్యను 2 లక్షల మెజారిటీతో గెలిపించాలని, వరంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని ప్రకటించారు. సీఎం సభ సందర్భంగా వేదికపై ఏర్పాటుచేసిన గాడిద గుడ్డు ఆకారం గురించి ప్రజలు విశేషంగా చర్చించుకున్నారు.


కేసీఆర్‌ తిట్లే మోదీ తిట్టారు..

చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి బాలాపూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న రేవంత్‌.. రోజూ తనను కేసీఆర్‌ తిట్టే తిట్లనే మోదీ తిట్టారని, కేసీఆర్‌ స్పీచ్‌ను ఎత్తుకపోయి రఘునందన్‌రావు మోదీకిచ్చిన్నట్లు తనకు అనుమానమున్నదని ఎద్దేవా చేశారు. బస్సుయాత్రలో కేసీఆర్‌ తాను చేసినది చెప్పుకోకుండా.. వంద రోజుల్లో రేవంత్‌ ఏమి చేయలేదని, అర్జెంట్‌గా తాను ముఖ్యమంత్రి కావాలంటున్నారని ధ్వజమెత్తారు. కానీ.. తాను వందలాది మంది పిల్లలను బలిచ్చిరాలేదని, ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలేదని మండిపడ్డారు.

‘‘అల్లాటప్పాగా రాలే బిడ్డా.. అనుకుంటే దిగడానికి.. ఏదో తమాషా అనుకుంటున్నావ్‌.. ఏడాది తిరిగే లోపు మళ్ల సీఎం అయితానని.. ఏడాది కాదు నీ జీవితంలో పదవనేదే లేదు. ఇక పదవిని కళ్లతో చూడలేవ’’ని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరులో కేసీఆర్‌ ఓటమితో ఆట అయిపోలేదని.. ఫైనల్‌లో తెలంగాణ వర్సెస్‌ గుజరాత్‌ టీమ్‌ అని.. తెలంగాణ టీమ్‌కు రాహుల్‌, రేవంత్‌ కెప్టెన్‌ అయితే.. గుజరాత్‌ టీమ్‌కు మోదీ, అమిత్‌ షా కెప్టెన్‌లని సీఎం అన్నారు. ఈ ఆటలో గెలువలేనని మోదీకి తెలిసే.. రాష్ట్రానికి ఢిల్లీ పోలీసులను పంపారన్నారు. దాడులు చేసి, కేసులు పెట్టి వేధిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే మోదీకి పడుతుందన్నారు. తెలంగాణోళ్లకు గాడిద గుడ్డు.. గుజరాత్‌కు బంగారు గుడ్డా? అని విమర్శించారు. ‘‘నన్ను తిట్టనీకి ఢిల్లీ నుంచి ఏడు విమానాల్లో రావాలా.? ఇక్కడ ఉన్న కేసీఆర్‌, మీ కిషన్‌రెడ్డి చేస్తున్నదదే కదా?’’ అని మోదీని ఉద్దేశించి రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - May 01 , 2024 | 05:54 AM