Share News

Medaram Jatara: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి సమ్మక్క..

ABN , Publish Date - Feb 24 , 2024 | 08:31 PM

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది.

Medaram Jatara: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి సమ్మక్క..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనమయ్యారు. వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో మేడారంలో వర్షం కురవడం విశేషం. వర్షాన్ని శుభ సూచకంగా భావించిన భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇంఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.

మేడారం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీమంత్రులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు మేడారం జాతరకు హాజరయ్యారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.


కాగా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆన్ లైన్ ద్వారా ఈ మొత్తాన్ని అందజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 08:31 PM