KCR: నేను సైతం ప్రధాని రేసులో!!
ABN , Publish Date - May 12 , 2024 | 05:03 AM
ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలో రానుందని.. తాను కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నానని జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు! రాష్ట్రంలో రాజకీయంగా బతికి బట్టకట్టడమే పెను సవాల్‌గా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్నారు. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని.. ఈమేరకు తాను ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.

కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం
ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా
బీజేపీకి రాష్ట్రంలో ఒకటి లేదా సున్నా సీట్లు
ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లకు మించి రావు
మాకు 12-14 సీట్లు.. కాంగ్రెస్‌కు 9చోట్ల 3వ స్థానమే
బీఆర్‌ఎస్‌కు 14 సీట్లిస్తే తెలంగాణ తడాఖా చూపిస్తాం
అసెంబ్లీలో నా ప్రళయతాండవం చూస్తారు.. ఆగస్టు 15లోగా రుణమాఫీ అసాధ్యం
మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది.. మహారాష్ట్రలోనూ పోటీ: కేసీఆర్
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలో రానుందని.. తాను కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నానని జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు! రాష్ట్రంలో రాజకీయంగా బతికి బట్టకట్టడమే పెను సవాల్‌గా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్నారు. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని.. ఈమేరకు తాను ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ‘‘ఈ ఎన్నికల్లో 14 సీట్లలో బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. తమ జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని.. అక్టోబరులో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 9 చోట్ల మూడోస్థానంలో ఉండనుందని.. బీజేపీకి ఒకటి లేదా సున్నా సీట్లే వస్తాయని.. తమకు 12 నుంచి 14 దాకా స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.
దేశంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావని, దక్షిణాది రాష్ట్రాల్లో 10 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. ఉత్తరాదిన బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతాయని.. ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చే చాన్స్ లేదని స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతు రుణమాఫీ అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ‘‘రేవంత్ చేతగాని సీఎం. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరలించుకుపోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నా ఏం చేయలేకపోతున్నాడు’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకున్న కార్నింగ్ పరిశ్రమ.. కరెంట్ కోతలు, ప్రభుత్వ చేతకానితనం కారణంగా తమిళనాడుకు తరలిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ మహాసముద్రం లాంటిదని, లక్షమంది రేవంత్‌లు వచ్చినా ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సకు చెందిన 26మంది తమ పార్టీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, ఆ సెషన్స్‌లో ప్రళయ తాండవం చూస్తారని అన్నారు.
వాడెవడయ్యా.. రాధాకిషన్‌రావు..
సీఎం కేసీఆర్ చెప్పినందువల్లే ఫోన్ ట్యాపింగ్ చేశానని టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలం గురించి అడగ్గా.. ‘వాడెవడయ్యా రాధాకిషన్‌రావు.. ట్యాపింగ్‌కు సీఎంకు ఏం సంబంధం ఉంటుంది అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ఇంటెలిజెన్స్ వర్గాలు రోజూ ఫోన్ ట్యాపింగ్ చేసి, ఆ వివరాలు సీఎంకు చెబుతుంటాయి. సీఎం, మంత్రులకు ట్యాపింగ్‌తో సంబంధం లేదు. టెలిగ్రామ్ యాక్ట్ తరపున హోంమంత్రి అనుమతి తీసుకున్నాకే ట్యాపింగ్ చేస్తుంటారు’’ అని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మోదీ సృష్టించిందేనని.. ఒక్క ఆధారం లేకున్నా, కేజ్రీవాల్‌ను, తన కుమార్తెను అరెస్ట్ చేశారని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతో్‌షను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినందువల్లే కక్షగట్టి కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తుందన్నారు. ‘‘జైళ్లు మాకు కొత్తేం కావు... ఏం ఫరక్ పడదు’’ అని అన్నారు. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తే స్వాగతిస్తామనే ఖర్గే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. హైదరాబాద్ తెలంగాణ ప్రజల ఆస్తి అని, రెండో రాజధాని కానివ్వబోమని పేర్కొన్నారు. కాగా.. రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేతగా సురే్‌షరెడ్డిని నియమించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. కాగా, బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిశాంక్ శనివారం కేసీఆర్‌ను కలిశారు.