Share News

Hyderabad: ఎండలకు కేసీఆర్‌ ఆగమాగం అవుతున్నడు: జగ్గారెడ్డి

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:58 AM

రాహుల్‌ గాంధీ దెబ్బకు మోదీ, అమిత్‌ షా, మోహన్‌ భాగవత్‌లు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

Hyderabad: ఎండలకు కేసీఆర్‌ ఆగమాగం అవుతున్నడు: జగ్గారెడ్డి

ఏడాదికి ఒకసారైనా బయటకు రాని

కేసీఆర్‌ రోడ్‌ షోల కోసం రోడ్డున పడ్డారు

రాహుల్‌ దెబ్బకు మోదీ, షా, భాగవత్‌

ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారు

కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుంది

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది

అందుకే సీఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు

తొమ్మిదేళ్లు ప్రజల్ని ఎగిరెగిరి తన్నిన కేసీఆర్‌

అందుకే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టారు

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ దెబ్బకు మోదీ, అమిత్‌ షా, మోహన్‌ భాగవత్‌లు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీలు రాహుల్‌ గాంధీ వెంట వస్తున్నారని అర్థమయ్యే వారు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా వారు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్‌ రాహుల్‌ గాంధీది కాదా అన్నారు.


ఎండలకు కేసీఆర్‌ ఆగమాగం చేస్తుండని, అలాగే బీజేపీ వాళ్లు నోటీసులు ఇచ్చి ఆగమాగవుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారన్నది తెరపైకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి దెబ్బపడుతుందనే సీఎం రేవంత్‌కి ఈ అంశంపైన నోటీసులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎస్సీ, ఎస్టీలు అనుకూలం కాబట్టే బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు.


సీఎం రేవంత్‌కు నోటీసులు.. ఎన్నికల స్టంట్‌లో భాగమేనని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రంలో హంగూ లేదు.. బొంగూ లేదని, ఇండియా కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచేది లేదన్నారు. ఏడాదికి ఒకసారైనా బయటకి రాని కేసీఆర్‌.. ఇప్పుడు రోడ్‌ షోల పేరుతో రోడ్డున పడ్డారన్నారు. గడిచిన 9 ఏళ్లు ప్రజలను కేసీఆర్‌ ఎగిరెగిరి తన్నారని, అందుకే ప్రజలు కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోపెట్టారన్నారు. ఇప్పటికే ఆయన పార్టీలో ‘టీ’ మిస్సయిందన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 05:58 AM