Share News

TG: ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు మోక్షం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:22 AM

తెలుగు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల సమస్య త్వరలోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

TG: ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు మోక్షం!

  • బదిలీల అంశాన్ని పరిశీలించండి

  • జీఏడీ అధికారులతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల సమస్య త్వరలోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు, ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ కావాలనుకున్న ఉద్యోగుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సాధారణ పరిపాలనా శాఖ అధికారుల(జీఏడీ)కు సూచించినట్లు తెలిసింది. అయితే ఈ బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారానికి రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలోనే రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ జరిగినా.. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల్లో ఉన్నవారికి అప్పట్లో ఆప్షన్లు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే స్వచ్ఛందంగా ఏపీకి వెళ్లాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం 2021లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ అవకాశం కల్పించింది.


దీంతో ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి 1881 మంది, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లడానికి 1369 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఈ అంశంపై గత బీఆర్‌ఎస్‌, వైసీపీ ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఎటూ తేల్చలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న ఉద్యోగులు ఇటీవల ఇక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని, సీఎంవో ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రిని కలిశారు. ఈ అంశాన్ని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరితగతిన పరిష్కరించాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో రాష్ట్ర జీఏడీ అధికారులు ఏపీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 03:22 AM