Share News

CM Revanth: మళ్లీ మోదీ ఎందుకు ప్రధాని కావాలి.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:41 PM

మళ్లీ మోదీ ఎందుకు ప్రధాని కావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని బాధ పడింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో మోదీని కలిసినా ఆయన ఏం స్పందించడం లేదని ధ్వజమెత్తారు.

CM Revanth: మళ్లీ మోదీ ఎందుకు ప్రధాని కావాలి.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

హైదరాబాద్: మళ్లీ మోదీ ఎందుకు ప్రధాని కావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని బాధ పడింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో మోదీని కలిసినా ఆయన ఏం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. రైతులను కాల్చి చంపడం తప్ప బీజేపీ చేసింది ఏం లేదని విరుచుకుపడ్డారు. సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... మేడిగడ్డ విషయంలో నీళ్ల దోపిడీ జరిగిందని అన్నారు. నిన్న(ఆదివారం) కేటీఆర్ అచ్చంపేటలో అవాకులు, చేవాకులు మాట్లాడారని.. గోదావరి, కృష్ణ జలాలు, ఉద్యోగ నియామకాలు గత కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.

పదేళ్లలో జరిగిన విధ్వంసంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. మాజీమంత్రి కేటీఆర్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను తెలంగాణలో నిలబెట్టడంలో తాను ముందు ఉన్నానని.. బీఆర్ఎస్‌ను నిలబెట్టడంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. సీఎం కుర్చీకి అందరూ పోటీ పడతారని.. తప్పు లేదని సీఎం రేవంత్ అన్నారు.

రైతు బంధు అందువల్లే ఇవ్వట్లేదు..

‘‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర సింగరేణిది. సకల జనుల సమ్మెలో వీరు దేశం అబ్బురపడేలా పోరాటం చేశారు. గత పదేళ్లలో తెలంగాణ చాలా రకాలుగా వెనుకబడింది. కేంద్రం దీన్ని ప్రైవేట్ పరం చేయాలని భావిస్తే బీఆర్ఎస్ దీనికి వంత పాడింది. తెలంగాణకు ప్రధాన ఆధారమైన నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ తప్పుడు విధానాలను అవలంభించింది. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన ఇచ్చే జీతాలు 25తేదీ వరకు తీసుకెళ్లారు. మీము అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో 4వ తేదీన జీతాలు ఇచ్చాము. రైతు బంధు సమయానికి ఇవ్వాలని ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం ఆలోచిస్తున్నాం. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్లు తప్ప వాళ్ల ఆరోపణలు ఎవరు సమర్థించడం లేదు. వాళ్ల పార్టీ లీడర్లు ఎవరూ వీరి మాటలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. నియామకాల విషయంలో మా ప్రభుత్వం పూర్తి బాధ్యతగా ఉంది. మాజీమంత్రి హరీష్ రావు సన్నాసి లాగా మాట్లాడుతున్నారు. స్టాప్ నర్సు, పోలీస్ శాఖ, సింగరేణిలో కారుణ్య నియామకాలపై మా సర్కార్ తగిన నిర్ణయం తీసుకుంది. దూలం లాగా పెరిగిన హరీష్‌కు దూడకు ఉన్న మెదడు కూడా లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 10:41 PM