Share News

Chinna Jeeyar Swami: భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుంది

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:41 PM

భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ (Chinna Jeeyar Swami) అన్నారు.

Chinna Jeeyar Swami: భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుంది

హైదరాబాద్: భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ (Chinna Jeeyar Swami) అన్నారు. శుక్రవారం నాడు పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహాహారతి (Bharat Mata Mahaharathi) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్న జీయర్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందనరావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ... కేంద్రమంత్రి కాకముందు నుంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశం పట్ల ప్రేమ, శ్రద్ధను కిషన్ రెడ్డి చూపుతున్నారని తెలిపారు. వేదాల్లో నమస్కారం, ఆరాధన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ చేస్తామన్నారు.మాతృమూర్తికి మొదటి ఆరాధన జరిపే ఉత్తమ సంప్రదాయం భారతజాతికి మాత్రమే ఉందని చిన్న జీయర్ స్వామిజీ వ్యాఖ్యానించారు.


రాముడు ఆ విషయం నేర్పాడు

మనలో ఉండే దోషాలన్నింటినీ హరించే గొప్ప శక్తి భారతమాత ఒడిలో ఉండే మృత్తికకు ఉందని పేర్కొన్నారు. భారతదేశ మట్టికి ఒక పరిమళం, అందమైన రుచి ఉంది. ఇది ఇతర దేశాల్లోని మట్టికి ఉండదని తెలిపారు. అయోధ్యలో గుడి కట్టి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకున్నామని వివరించారు. శ్రీరాముడు ఆదర్శపురుషోత్తముడు. రాముడు మనిషి ఎలా ఉండాలో మానవజాతికి నేర్పాడని చెప్పారు. రాముడు దేవుడు కంటే మంచి మానవుడుని తెలిపారు. ఒక బోయ, ఒక రుషి, పక్షి, చెట్టు, నీరు, రాక్షసుడు, కోతి, ఉడత.. ఇలా అందరినీ ప్రేమించినవాడు రాముడు అని వ్యాఖ్యానించారు. దేవుడవ్వడం గొప్ప కాదు.. మానవుడు అవ్వడం గొప్ప. మానవుడిగా మసలగలగడం గొప్ప అని చెప్పారు. రాముడిని శత్రువు అనుకున్న రావణాసురుడు కూడా ధ్వేషించలేదన్నారు. రాముడు రావణాసురుడిని ధ్వేషించలేదు.. ఆయన తప్పును ధ్వేషించాడు. తప్పు చేసిన వాడిని దండించేది మనిషి అని చెప్పారు. మన భారతదేశంలోని ప్రతి వ్యక్తికి భారతమాత పురుడు పోసి ప్రాణం పెట్టిందని చిన్న జీయర్ స్వామిజీ తెలిపారు.

వజ్రసంకల్పంతో అడుగుపెట్టే కాలమిది

దేశానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆరాధించింది భారత జాతి. అనేకమంది భారతజాతిని వంచించి ఆక్రమించినా స్వాతంత్ర్యం పొంది స్వయంసమృద్ధిని చాటుకోవడానికి గణతంత్ర దినాన్ని పొందిందని వివరించారు. వజ్రసంకల్పంతో అడుగుపెట్టే కాలమిదన్నారు. శ్రీరాముడి ఆచరణతో ఒక గొప్ప ప్రేమ, సంస్కారం, ఆచారాన్ని భారతమాత ఇచ్చిందని తెలిపారు. ఉత్తమ పురుషోత్తముడైన రాముడికి మందిరం నిర్మించుకోవాలని ప్రపంచమంతా కోరుకుంది. జనవరి 22వ తేదీ తర్వాత జగత్తంతా రామమయమైందని పేర్కొన్నారు. శ్రీరాముడిని ప్రేరణగా తీసుకొని సదాచారంతో మనమూ ఆదర్శ మానవులుగా నిలవాలని తెలిపారు. భారతదేశం యొక్క 75వ వజ్రోత్సవం మన సంకల్పానికి వజ్రత్వాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. భారతమాత ఆశీర్వాదం దేశానికి వజ్రతుల్యమైన నేతృత్వాన్ని వహించే నాయకులకి మంచి ఆయువు, శక్తియుక్తులు ప్రసాదిస్తుందని... భారతీయులందరినీ యోగ్యులుగా తయారుచేస్తుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భారతమాతకు మహాహారతి కార్యక్రమం గణతంత్ర దినోత్సవం రోజున జరుపుకోవడం గొప్పగా ఉందని.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని దశదిశలా చాటుతుందని చిన్న జీయర్ స్వామిజీ వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 26 , 2024 | 10:41 PM