Share News

TS Assembly: కాంగ్రెస్ పాలనపై సభలో హరీష్‌రావు వినిపించిన పాటలు ఇవే..

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:52 PM

Telangana: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై పలువురు కవులు పాడిన పాటలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సభలో వినిపించారు. సాగునీటి రంగంపై శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది.

TS Assembly: కాంగ్రెస్ పాలనపై సభలో హరీష్‌రావు వినిపించిన పాటలు ఇవే..

హైదరాబాద్, ఫిబ్రవరి 17: సాగునీటి రంగంపై శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందంటూ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ధీటుగా సమాధానం ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే గరమయ్యారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు. అలాగే సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై పలువురు కవులు పాడిన పాటల హరీష్‌రావు సభలో వినిపించారు.

హరీష్‌రావు వినిపించిన పాటలివే..

సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి లేడని వ్యాఖ్యలు చేశారు.

1.కాంగ్రెస్ పాలనలోరన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో

గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరాకన్నీల్లు రాల్చింది.

సింగరేణి తల్లి సిన్నబోయినాది. సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయ్యినాది.

అని కాంగ్రెస్ దుర్మార్గపు దాష్టికాల గురించి ప్రజా యుద్ధనౌక గద్దర్ రాసినారు అధ్యక్షా..

2. ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి

దక్సిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి

నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు

మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లీ

చూడు తెలంగాణ, చుక్కలేని నీళ్లు లేని దాన

మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన..

అని అందెశ్రీ కాంగ్రెస్ పాపిష్టి పరిపాలనను శపిస్తూ రాశారు.

3. మరో కవి జయరాజు...

వానమ్మవానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ

చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్ళు లేవు అని హృదయం ద్రవించి పోయేలా రాశారు. కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడు, గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడు. ఇట్ల చెప్పుకుంటు పోతే రేపటి దాక చెప్పచ్చు అధ్యక్షా అంటూ ఎమ్మెల్యే హరీష్‌రావు సభలో పాటలు పాడి వినిపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2024 | 01:52 PM