Share News

KCR: కొత్త సీఎంకు అవగాహన లేదు... అలా చేస్తే అడుక్కోవాల్సిందే..

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:08 PM

Telangana: తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని... ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెల్వదని బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

KCR: కొత్త సీఎంకు అవగాహన లేదు... అలా చేస్తే అడుక్కోవాల్సిందే..

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) అవగాహన లేదని... ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెల్వదని బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని నేతలకు బీఆర్‌ఎస్ అధినేత వివరించారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే అడుక్కోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని.. సీఎం రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు పాలన ఎలా చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని... దీని వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ అధినేత డిమాండ్ చేశారు.

ఎంతకాడికైనా పోరాడుతాం...

రైతులకు నష్టం చేసేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామన్నారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని స్పష్టం చేశారు. మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ఉద్యమకారులదే అని అన్నారు. ప్రభుత్వం అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా మారిందన్నారు. ‘‘కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించింది’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 04:37 PM