Share News

TS Politics: పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్లాన్ ఇదేనా..?

ABN , Publish Date - Feb 11 , 2024 | 08:14 PM

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా రథయాత్రలను చేపడుతున్నామని తెలిపారు.

TS Politics: పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్లాన్ ఇదేనా..?

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా రథయాత్రలను చేపడుతున్నామన్నారు. రథయాత్రలకు సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈ యాత్రలో రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నేతలు పాల్గొంటారన్నారు. ఈ ఎన్నికలు సుస్థిరత, అస్తిరతకు మధ్య జరగనున్నాయని చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు బీజేపీ రథయాత్రలు చేపడుతుందని ప్రకటించారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఈ ఐదు రథయాత్రలు కొనసాగుతాయన్నారు. ఒక్కొక్క రథం ఒక్కొక్క క్లస్టర్‌లో తిరగనుందని తెలిపారు. ఈ ఐదు రథ యాత్రల్లో 33 జిల్లాల్లో 119 అసెంబ్లీ నియోజక వర్గాలు కవరేజ్ చేస్తాయన్నారు. ఒక్కొక్క యాత్రల్లో ప్రతి రోజూ రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు కవర్ చేస్తారని తెలిపారు.

ప్రతి యాత్రలో ముఖ్య నాయకులు పాల్గొంటారని.. 17 ఎంపీ సీట్లు గెలిచే విధంగా ప్లాన్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎంను మట్టి కరిపిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ యాత్రలకు వివిధ క్లస్టర్లను బట్టి వివిధ పేర్లు కేటాయించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలకుగానూ కొమురం భీమ్ యాత్రగా నామకరణం చేశారు. కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్లకు.. శాతవాహన యాత్ర, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు గానూ.. కాకతీయ యాత్ర, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి క్లస్టర్లలకు సంబంధించి భాగ్యనగరి యాత్ర, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు కృష్ణమ్మ యాత్రగా నామకరణం చేసినట్లు వివరించారు. ఈ యాత్రలో రోడ్ షోస్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాలో కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 08:14 PM