Share News

Harish Rao: డయాగ్నస్టిక్‌ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్‌ సర్కారు

ABN , Publish Date - May 21 , 2024 | 03:14 AM

రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ సర్కారు ఐదు నెలల్లోనే కుప్ప కూల్చడం బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం ‘డయాగ్నస్టిక్‌ హబ్‌లకు జబ్బు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ‘లక్షలాది మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

Harish Rao: డయాగ్నస్టిక్‌ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్‌ సర్కారు

  • తక్షణమే సిబ్బందికి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై మాజీ మంత్రి హరీశ్‌ స్పందన

హైదరాబాద్‌/దేవరకొండ, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ సర్కారు ఐదు నెలల్లోనే కుప్ప కూల్చడం బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం ‘డయాగ్నస్టిక్‌ హబ్‌లకు జబ్బు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ‘లక్షలాది మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కేసీఆర్‌ హయాంలో 36 డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి.


ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. ఇప్పటికైనా తక్షణం స్పందించి డయాగ్నస్టిక్స్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి పెండింగ్‌ జీతాలు చెల్లించాలి. డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలి’ అని హరీశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లోని భారత విద్యార్థులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, అక్కడి తెలంగాణ విద్యార్థుల భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని హరీశ్‌ మరో ట్వీట్‌లో కోరారు. రైతులు పండించిన ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీ.. అదొక పెద్ద బోగస్‌ అని ఆరోపించారు. సన్నాలకు మాత్రమే రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పడం తగదని, అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్‌ పాలనలో టీచర్లపై లాఠీలు, బడుగు జీవులకు ఝూటా హామీలిస్తూ కాలయాపన చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ఉపాధ్యాయులపై లాఠీచార్జీని బీఆర్‌ఎస్‌ ఖండిస్తోందని, ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ తండ్రి కనిలాల్‌ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో.. దేవరకొండలో రవీంద్రకుమార్‌ను పరామర్శించారు.

Updated Date - May 21 , 2024 | 03:14 AM