Share News

Harish Rao: చెయ్యి గుర్తుకు ఓటు వేయమని.. మొండి చెయ్యి చూపింది..

ABN , Publish Date - May 23 , 2024 | 04:16 AM

రైతులు పండించిన అన్ని పంటలకు రూ. 500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం బోగస్‌ మాటలు చెప్పిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బోనస్‌ ఇస్తామని ఆశ చూపి రైతుల్ని చెయ్యి గుర్తుకు ఓటు వేయమని.. మొండి చెయ్యి చూపిందని ఆరోపించారు.

Harish Rao: చెయ్యి గుర్తుకు ఓటు వేయమని.. మొండి చెయ్యి చూపింది..

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట కొనడం లేదు

  • ఇచ్చిన మాట ప్రకారం అన్ని పంటలకు బోనస్‌ ఇవ్వాలి

  • మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

చిన్నకోడూరు, మే 22 : రైతులు పండించిన అన్ని పంటలకు రూ. 500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం బోగస్‌ మాటలు చెప్పిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బోనస్‌ ఇస్తామని ఆశ చూపి రైతుల్ని చెయ్యి గుర్తుకు ఓటు వేయమని.. మొండి చెయ్యి చూపిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాహకులను కొనుగోలు కేంద్రంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం తడిసిన వడ్లను కొనుగోలు చేస్తున్నామని చెబుతుందని, అందుకు బాధ్యత కలెక్టర్లదేనని కేబినెట్‌లో నిర్ణయాలు ప్రకటిస్తున్నారన్నారు. హైదరాబాదులో మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పంట కొనే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామని చెప్పి, ఓట్లు డబ్బాలో పడ్డాక సన్న రకాలకే ఇస్తామని ప్రభుత్వం చెబుతుందన్నారు.


సన్న రకాలకు రోగాలు ఎక్కువ, పెట్టుబడి ఖర్చు ఎక్కువ, పంట కాల పరిమితి ఎక్కువ, దిగుబడి తక్కువ అని రైతులు అంటున్నారని మాజీమంత్రి తెలిపారు. దొడ్డు రకాలే పండుతాయని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జనుము, జీలుగ విత్తనాలు ఎక్కడా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎరువుల బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్‌లో పెట్టారని.. మళ్లీ ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాల కోసం పాస్‌ బుక్‌లు లైన్‌లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే జూన్‌ నెలలోనే ఎకరాకు రూ. 7,500 పెట్టుబడి సాయం(రైతు భరోసా) రైతుల ఖతాలో వేయాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పంటలకు బోనస్‌ ఇవ్వాలని, పచ్చి రొట్ట విత్తనాలను అన్ని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో, ప్యాక్స్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని మాజీమంత్రి డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు.

Updated Date - May 23 , 2024 | 04:16 AM